హిట్లిచ్చిన దర్శకుడికి ఇంత గ్యాప్ ఏమిటో

టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులకు లోటు లేదు. కానీ దాన్ని పరిపూర్ణంగా, క్రమం తప్పకుండా వాడుకునేవాళ్ళు ఎంతమంది అంటే సమాధానం వెంటనే దొరకదు. ఆ లిస్టులో లేకుండా ఉన్నవాళ్ళలో ముందు వినిపించే పేరు శశికిరణ్ తిక్క. 2018 ‘గూఢచారి’తో డైరెక్టర్ గా తన ప్రతిభను ఋజువు చేసుకున్న తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకుని 2022 ‘మేజర్’తో మరోసారి తన సత్తా చాటారు. అడివి శేష్ కు ఇవి ఎంత బ్రేక్ త్రూ అయ్యాయో చెప్పనవసరం లేదు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చాయి.

ఇదంతా జరిగి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శశికిరణ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు. మధ్యలో కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’కు స్క్రీన్ ప్లే అందించి సమర్పకుడిగా ఉండటం మినహా ఇంకే మూవీ చేయలేదు. తాజాగా సాయి దుర్గ తేజ్ తో ఒక ప్రాజెక్టు ఓకే అయ్యిందని విశ్వసనీయ సమాచారం. సంబరాల ఏటిగట్టు తర్వాత తేజ కాకుమాను డైరెక్షన్లో కొత్త మూవీ చేస్తున్న సుప్రీమ్ హీరో లిస్టులో ‘క’ ఫేమ్ సుజిత్ అండ్ సందీప్ ఉన్నారు. తర్వాత పేరు శశికిరణ్ దేనని మెగా కాంపౌండ్ టాక్.

సరే అంతా బాగానే ఉంది కానీ ఇలా ఒక్కో సినిమాకు ఇంతేసి నిడివి పెట్టుకుంటే కెరీర్ మొత్తంలో ఎన్ని సినిమాలు చేయగలరు. ఒకప్పుడు దాసరి, కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ రోజుకు మూడు షిఫ్టులకు పైగా పని చేస్తూ ఏడాదికి అయిదారు సినిమాలు ఇచ్చినా అలిసిపోయే వాళ్ళు కాదు. ఇప్పుడు అలాంటి వేగం సాధ్యం కాదు కానీ కనీసం సంవత్సరానికి ఒక చిత్రం కూడా చేయలేని స్టేజిలో యంగ్ డైరెక్టర్స్ ఉండటం విచారకరం. శశికిరణ్ ఒక్కరే కాదు ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు.

ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా తరుణ్ భాస్కర్ కౌంట్ ఇంకా అయిదు దాటలేదు. బేబీలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా సాయిరాజేష్ నిర్మాతగా రచయితగా బిజీగా ఉంటున్నారు తప్పించి తన డైరెక్షన్ లో కొత్త తెలుగు ప్రాజెక్టు చేపట్టలేదు. బేబీ హిందీ రీమేక్ అంటున్నారు కానీ దాని ఊసు కూడా పెద్దగా వినిపించడం లేదు. ఒకపక్క హీరోలు సరైన కథలు దర్శకులు దొరక్క అల్లాడిపోతూ సెల్ఫ్ డైరెక్షన్ కు వెళ్లిపోతుంటే ఇలా సరుకు ఉన్నా వాళ్ళు స్లోగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.