మెగా ఫ్యామిలీలో కొత్త ‘కుంపటి’

టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది హీరోలకు సొంతంగా నిర్మాణ సంస్థలు ఉండగా.. ఇప్పుడు కొత్తగా సాయిధరమ్ తేజ్ సైతం ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుంటుండడం విశేషం. గూఢచారి, మేజర్ చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తేజు ఒక సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. 

ఆ చిత్రం కోసం సొంతంగా బేనర్ మొదలుపెడుతున్నాడట తేజు. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట. ‘మేజర్’ తర్వాత శశికిరణ్ నిర్మాతగా మారి, కథ అందిస్తూ ‘సత్యభామ’ అనే సినిమా తీశాడు. అది నిరాశపరిచింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నాడు. శశికిరణ్ స్టయిల్లోనే ఇది థ్రిల్లర్ మూవీ అని సమాచారం.

యాక్సిడెంట్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించిన తేజు.. ఆ తర్వాత మళ్లీ విరామం తీసుకున్నాడు. ఆపై అతను మొదలుపెట్టిన ‘సంబరాల యేటి గట్టు’ సుదీర్ఘ కాలం చిత్రీకరణ దశలో ఉంది. బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోవడం, షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ సినిమాను పూర్తి చేయడానికి బాగా టైం పట్టింది. ఈ మధ్యే షూటింగ్ అయితే పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కానీ.. ఖాయం అని చెప్పలేం.

‘సంబరాల యేటిగట్టు’ తర్వాత తేజు స్పీడు పెంచే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ‘సేవ్ ద టైగర్స్’తో దర్శకుడిగా మారిన నటుడు తేజ కాకుమాను దర్శకత్వంలో తేజు ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. దీంతో పాటు ‘క’ దర్శక ద్వయం సుజీత్-సందీప్‌లతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇంకా సీనియర్ నిర్మాత వివేక్ కూచిభొట్ల ప్రొడక్షన్లోనూ ఒక సినిమా చేయాల్సి ఉంది. వీటికి తోడు ఇప్పుడు సొంత బేనర్లో శశికిరణ్ తిక్కతో సినిమాను ఓకే చేశాడు. చూస్తుండే వచ్చే రెండేళ్లలో తేజు నాలుగు సినిమాలతో పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.