సవాళ్లకు సిద్ధమవుతున్న వారణాసి

వారణాసి అప్డేట్స్ కావాలని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్న వైనం ఈ మధ్య పెరిగింది. ఏప్రిల్ 7 ఎంతో దూరంలో లేదు కాబట్టి ఇంత పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీకి కనీసం నాలుగు నెలల ముందు పబ్లిసిటీ మొదలుపెట్టాలనేది వాళ్ళ డిమాండ్. గత ఏడాదే ఇంటర్వ్యూల రూపంలో పబ్లిసిటీ స్టార్ట్ చేసిన రాజమౌళి ఈ మధ్య సైలెంట్ అయ్యారు. రిలీజ్ వాయిదా పడొచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ ఏదైనా యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చెప్పిన డేట్ కు రావాలంటే వారణాసి ముందు పలు సవాళ్లున్నాయి. ఐమాక్స్, డాల్బీ విజన్, 4డిఎక్స్ సహా మొత్తం 18 ఫార్మాట్లలో ప్రింట్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. ప్రపంచ దేశాల్లో ప్రీమియమ్ స్క్రీన్లలో ఒకేసారి షోలు పడాలంటే కనీసం నలభై రోజుల ముందు ప్రింట్లు రెడీ చేయాలని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే మార్చి మొదట్లోనే డెలివరీకి ప్రిపేర్ అవ్వాలన్న మాట. రామాయణ ఇది అందుకోలేకే కొన్ని చోట్ల రాజీపడాల్సి వచ్చింది.

కానీ రాజమౌళి అలా కాంప్రోమైజ్ అయ్యే టైపు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్చి 26 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా రిలీజ్ కానుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో దీని డిమాండ్ అంతా ఇంతా కాదు. అప్పుడే అగ్రిమెంట్లు కూడా మొదలైపోయాయట. ఒకవేళ అది కనక ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేసుకుంటే కేవలం పదకొండు రోజుల గ్యాప్ లో వచ్చే వారణాసికి యుఎస్, యుకె లాంటి దేశాల్లో సమస్య తలెత్తుతుంది. ఓపెనింగ్స్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఇవన్నీ క్యాలికులెట్ చేసుకుంటూనే వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నారని టాక్. ఒకవేళ పోస్ట్ పోన్ అనివార్యం అయ్యే పక్షంలో ఆగస్ట్ కు వెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిసింది. అయితే వారణాసి ఎక్స్ హ్యాండిల్ మటుకు ఫ్యాన్స్ ఎవరు అడిగినా నర్మగర్భంగా సమాధానం ఇస్తోంది తప్పించి ఏప్రిల్ 7 అని నొక్కి చెప్పడం లేదు. దసరా, దీపావళికి ఎలాంటి సాలిడ్ అప్డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుందో. వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఈ గాసిప్స్ కు బ్రేకులు పడవు.