హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చాలా సినిమాలు తమిళంలో మాత్రం సరిగా ఆడని దాఖలాలు చాలానే చూశాం. కానీ ‘రామాయణం’ సినిమా మాత్రం తమిళనాట బాగా ఆడుతుండడం విశేషం. ఈ చిత్రం రిలీజ్ ముంగిట తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడ పెద్ద రిలీజ్ కూడా దక్కలేదు. సూర్య సినిమా ‘సీన్’కే పెద్ద పీట వేశారు. రిలీజ్ వీకెండ్లో సూర్య మూవీనే డామినేట్ చేసింది. ‘రామాయణం’ చిత్రానికి ఒక మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయంతే. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ‘సీన్’కు దీటుగా ‘రామాయణం’ నిలబడింది. రెండో వీకెండ్ వచ్చేసరికి ‘సీన్’ వెనక్కి వెళ్లిపోయి.. ‘రామాయణం’ తమిళ బాక్సాఫీస్‌లో నంబర్ వన్ సినిమాగా నిలుస్తుండడం విశేషం. రామాయణం సినిమాకు తమిళులు ఇంతగా కనెక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘రామాయణం’ మీద ప్రేమతోనో, రాముడి మీద భక్తితోనో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారనుకుంటే పొరపాటే. అలాంటి ప్రేక్షకులు ఉండొచ్చు కానీ.. వారి సంఖ్య తక్కువ. అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నది రావణుడి పాత్రకు అన్నది విశ్లేషకుల మాట.
ముందు నుంచి తమిళులు రామాయణంలో రాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. రాముడిని వ్యతిరేకిస్తూ రావణుడికి ఎలివేషన్ ఇస్తుంటారు. రావణుడు ఉన్న లంకను తమిళులు బాగా ఓన్ చేసుకోవడం.. రావణుడి పాత్రను ప్రేమించడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే.
మణిరత్నం అంతటివాడు కూడా రామాయణాన్ని మోడర్నైజ్ చేస్తూ తీసిన ‘రావణ్’ సినిమాలో విక్రమ్ చేసిన విలన్ పాత్రను హైలైట్ చేసి, రాముడిని పోలిన పృథ్వీరాజ్ క్యారెక్టర్ని నెగెటివ్‌గా చూపించడం గమనార్హం. ఇప్పుడు నితీశ్ తివారి ‘రామాయణం’లో రణబీర్ చేసిన రాముడి పాత్ర కంటే.. యశ్ చేసిన రావణుడి పాత్రే ఎలివేట్ అయింది. అందుకే ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారన్నది స్పష్టం. అందుకే ‘రామాయణం’ సినిమా తమిళనాట అంచనాలను మించి ఆడుతూ.. పెద్ద రేంజికి వెళ్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
