కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయినా.. రెండో సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడీ యువ కథానాయకుడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు వరుస కట్టాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహాలో ముందు వెనుక చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు.
హీరోగానే కాక విలన్‌గానూ ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ లాంటి క్రేజీ సినిమాల్లో నటించాడు. కానీ ఇవేవీ అతడికి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ మళ్లీ పుంజుకుని ‘బెదురు లంక 2012’, ‘భజే వాయు వేగం’ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. దీంతో కెరీర్ గాడిన పడ్డట్లే కనిపించింది. ఈ ఊపులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాడనుకుంటే.. హఠాత్తుగా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. రెండేళ్లకు పైగా కార్తికేయ పేరే వినిపించలేదు ఇండస్ట్రీలో. ఇలా గ్యాప్ తీసుకున్న నటులను ఇండస్ట్రీ జనాలే కాదు.. ప్రేక్షకులూ మరిచిపోతారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది కార్తికేయ ఏమైపోయాడు అంటూ ‘దూకుడు’లో ప్రకాష్ రాజ్ మీమ్ ఒకటి వేసి అతణ్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఐతే ఎట్టకేలకు కార్తికేయ తన పునరాగమనానికి సిద్ధమయ్యాడు. అతను తన కొత్త సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. తన కోసం సొంతంగా కథ రాసుకుని స్వీయ నిర్మాణంలో సినిమా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు కార్తికేయ. బుధవారం ఈ చిత్రానికి పెద్దగా హడావుడి లేకుండా ముహూర్త వేడుక కూడా పూర్తి చేశారు.
త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. షూటింగ్ మొదలుపెట్టనున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేయడానికే కార్తికేయ ఇంత గ్యాప్ తీసుకున్నాడని అర్థమవుతోంది. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్లో ఈ మధ్య కొందరు యువ కథానాయకులు సొంతంగా సినిమాలు తీసుకుంటున్నారు. విశ్వక్సేన్, కిరణ్ అబ్బవరం బాటలోనే ఇప్పుడు కార్తికేయ కూడా మెగా ఫోన్ పట్టేశాడు. మరి తన రీఎంట్రీకి ఆ సినిమా ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates