సెన్సేషనల్ సినిమా ఆలస్యమైతే ఎలా

కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది, రెండు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకునేలా చేసిన హనుమాన్ అంశ్ ఎల్లుండి అంటే సెప్టెంబర్ 18 తెలుగు డబ్బింగ్ విడుదల కావాల్సింది. త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యున్ ఫోర్ ద్వారా దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే సెన్సార్ ఆలస్యంతో పాటు కొన్ని సాంకేతిక కారణాల వల్ల హనుమాన్ అంశ్ వాయిదా పడిందని లేటెస్ట్ అప్డేట్. కొత్త తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఒరిజినల్ వెర్షన్ రిలీజై ఇప్పటికే నలభై రోజులు అయ్యింది. మన ప్రేక్షకులు చాలా మంది హిందీలోనే చూశారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు వారాలుగా హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. అయినా చూడని వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. వాళ్లంతా అనువాదం కోసం వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు రావడం లేదని తెలిస్తే నిరాశ తప్పదు. వచ్చేవారం సెప్టెంబర్ 24 ది ప్యారడైజ్ ఉంది. మొత్తం జనాల అటెన్షన్ అటువైపు వెళ్ళిపోతుంది.

మరి హనుమాన్ అంశ్ హక్కులు కొన్న త్రివిక్రమ్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. రిస్క్ అయినా పర్వాలేదని ప్యారడైజ్ తో తలపడితే చెప్పలేం. రెండు సంబంధం లేని వేర్వేరు జానర్లు కాబట్టి సరిపడా థియేటర్లు దక్కించుకుంటే చాలు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ప్రమోషన్ల విషయంలో హనుమాన్ అంశ్ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. బాలీవుడ్ లోనూ అలాగే చేశారు. కేవలం పబ్లిక్ టాక్ ప్రభంజనంలా మొదలై థియేటర్లను సునామీలాగా హౌస్ ఫుల్స్ చేసింది.

ఇప్పుడున్న ట్రెండ్ లో ఏదైనా వేడి మీద ఉన్నప్పుడే చేసేయాలి. ఇతర భాషలో హిట్టయిన సినిమా రీమేకైనా డబ్బింగ్ అయినా మరీ ఎక్కువ లేట్ చేయడం వల్ల ఓపెనింగ్స్, వసూళ్లు ప్రభావితం చెందుతాయి. గతంలో చావా విషయంలో ఇది జరిగింది. అలా రిపీట్ కాకూడదంటే పనులు వేగంగా జరిగిపోవాలి. హనుమాన్ అంశ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే నిన్న మొన్నటిదాకా పెద్దగా జన సందోహం లేని నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఇప్పుడు వేలాది టూరిస్టులతో కిక్కిరిసిపోతోందట.