నాని క్లాప్.. అప్పుడలా… ఇప్పుడిలా

వారసుల ఆధిపత్యం సాగే టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పెద్ద స్టార్లుగా ఎదిగిన హీరోలు చాలా కొద్ది మందే కనిపిస్తారు. కొత్తతరంలో నాని ఆ అరుదైన జాబితాకు చెందిన వాడే. ‘అష్టాచెమ్మా’ అనే చిన్న సినిమాతో పరిచయం అయిన అతను.. ఇప్పుడు టైర్-2ను దాటి టైర్-1 మీద కన్నేశాడు. తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. అంతకుమించి బిజినెస్ చేసేలా కనిపిస్తోంది. 

ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. నాని రేంజ్ మారిపోవడం ఖాయం. హీరోగా ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్న నాని.. నిర్మాతగా కొత్త నటులు, దర్శకులకు లైఫ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘కోర్ట్’ చిత్రంతో తన అభిరుచిని చాటుకుని పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాని.. ఇప్పుడు మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన నితిన్‌తో సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఈ కలయిక ఊహించనిదే.

ఒకప్పుడు నితిన్.. నాని కంటే పెద్ద హీరో. అసలు నాని హీరో అవ్వడానికి ముందు నితిన్ ఎలాంటి వైభవం చూశాడో తెలిసిందే. జయం, దిల్, సై చిత్రాలతో అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఐతే నితిన్ నటించిన ఏ సినిమాకు అన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. ఒక చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ క్లాప్ కొట్టాడట. ఇప్పుడేమో నితిన్ సినిమాకు నిర్మాతగా క్లాప్ కొట్టడం తన ఎదుగుదలకు నిదర్శనం అంటూ అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా నానికి ఎలివేషన్ ఇస్తున్నారు.

స్వయంగా బండ్ల గణేష్ లాంటి ప్రముఖ నిర్మాత నాని అప్పటి, ఇప్పటి ‘క్లాప్’ల గురించి ఒక పోస్టు పెట్టాడు. స్వయంకృషితో నాని ఈ స్థాయికి రావడం పెద్ద ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఇంకా పెద్ద రేంజిలో ఉండాల్సిన నితిన్.. ఇప్పుడు హిట్టు కోసం కష్టపడుతుండడం తన అభిమానులను ఒకింత బాధిస్తోంది. మరి నిర్మాతగా ‘లక్కీ హ్యాండ్’ అని  పేరున్న నాని ప్రొడ్యూస్ చేసే సినిమాతో అయినా అతను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.