సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చే ప‌ర భాషా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు మ‌న వాళ్ల సినిమా ప్రేమ గురించి గొప్ప‌గా చెబుతుంటారు. కొన్ని భాష‌ల వాళ్ల మాదిరి మా సినిమానే గొప్ప అనుకునే ర‌కం కాదు తెలుగువాళ్లు. ఏ భాష నుంచి సినిమా వ‌చ్చినా స‌రే.. దానికి క‌నెక్ట్ అయితే నెత్తిన పెట్టుకుంటారు. త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ అనువాదాల‌ను కూడా మ‌న వాళ్లు ఎలా సెల‌బ్రేట్ చేస్తారో తెలిసిందే.

ఇక హాలీవుడ్ సినిమాల‌నైతే ద‌శాబ్దాల నుంచి మ‌హ గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు. ఇక అక్క‌డి సూప‌ర్ హీరోల సినిమాల‌కైతే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటారు మ‌న ఫ్యాన్స్. ఇప్పుడు స్పైడ‌ర్ మ్యాన్‌ను మ‌న ఆడియ‌న్స్ ఆద‌రిస్తున్న తీరు న‌భూతో అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మేజ‌ర్ సిటీస్ అన్నింట్లోనూ స్పైడ‌ర్ మ్యాన్ సంద‌డి మామూలుగా లేదు.

ఇక హైద‌రాబాద్ సంగ‌తైతే చెప్పాల్సిన ప‌ని లేదు. టాలీవుడ్లో ఒక సూప‌ర్ స్టార్ న‌టించిన భారీ చిత్రం రిలీజైన‌ట్లుగా థియేట‌ర్ల‌లో హంగామా మామూలుగా లేదు. స్పైడ‌ర్ మ్యాన్ థియేట‌ర్ల‌లో టైటిల్ కార్డ్ ద‌గ్గ‌ర్నుంచి.. ఎండ్ కార్డ్ వ‌ర‌కు అభిమానుల సంద‌డి చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. లోక‌ల్ స్టార్ల‌ను చూసిన‌పుడు ఎగ్జైట్ అయిన‌ట్లు కాగితాలు ఎగ‌రేస్తూ, ఈల‌లు వేస్తూ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

సంబంధిత వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సైలెంటుగా సినిమాలు చూసే విదేశీ ఆడియ‌న్స్.. ఈ వీడియోలు చూసి విస్తుబోతున్నారు. సినిమాను ఇంత‌గా సెల‌బ్రేట్ చేస్తారా.. అందులోనూ త‌మ భాషా చిత్రం కాక‌పోయినా ఇంత హంగామా ఉంటుందా అని షాక‌వుతూ ఆ వీడియోల‌ను రీపోస్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు చూడ‌డంలో, సెల‌బ్రేట్ చేయ‌డంలో మ‌న వాళ్ల‌కు సాటి వ‌చ్చే ప్రేక్ష‌కులు ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా ఉండ‌ర‌న‌డానికి ఇది రుజువు.