తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించిన తమన్నా.. ఇప్పుడు ఇక్కడి చిత్రాల గురించి తక్కువ చేసి మాట్లాడ్డం మీద విమర్శలు తప్పలేదు. 

అక్కడికేదో బాలీవుడ్లో హీరోయిన్లలో ఉదాత్తమైన పాత్రలే చేయించేట్లుగా ఆమె మాట్లాడింది. కానీ ఆమె బాలీవుడ్లో చేసినవి కూడా గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్సే. ‘లస్ట్ స్టోరీస్’, ‘జీ కర్దా’ లాంటి వెబ్ సిరీస్‌ల్లో ఆమె చేసిందేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు తమన్నా ఒప్పుకున్న కొత్త సినిమా సంగతేంటో తెలిస్తే ఆమె కామెంట్లు మరింత విడ్డూరంగా అనిపించక మానవు.

బాలీవుడ్లో బోల్డ్ సినిమాలకు పెట్టింది పేరైన ఏక్తా కపూర్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘రాగిణి-3’లో తమన్నా నటించబోతోంది. దీని గురించి ఇంతకుముందే వార్తలు రాగా.. ఆ విషయం అధికారికం అయింది. తమన్నానే ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. ‘రాగిణి ఎంఎంఎస్’ ఫ్రాంఛైజీలో ఈ చిత్రం భాగం. తొలి రెండు చిత్రాలకు బోల్డ్ సీన్లే ఆకర్షణగా మారాయి. 

ఏక్తా కపూర్ ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీసి సొమ్ము చేసుకుంటూ ఉంటుంది. ‘రాగిణి ఎంఎంఎస్-2’లో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ లీడ్ రోల్ చేయడం గమనార్హం. ఇప్పుడు పార్ట్-3కి తమన్నా హీరోయిన్ కాబోతోంది. ఈ ఫ్రాంఛైజీ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లస్ట్ స్టోరీస్-2’ను మించి ఇందులో తమన్నా బోల్డ్ ట్రీట్ ఇస్తే ఆశ్చర్యమేమీ లేదు.