దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా చేజేతులా నాశనం చేసుకున్నాడో తెలిసిందే. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం రెండేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు.

ఐతే ఆరు నెలలు తిరిగేసరికే అతను రెగ్యులర్ బెయిల్ మీద బయటికి వచ్చేశాడు. కానీ తర్వాత కోర్టు సీరియస్ అయి అతడి బెయిల్‌ను రద్దు చేయడం.. దర్శన్ మళ్లీ జైలు పాలవడం తెలిసిందే. అతను జైల్లో ఉండగానే తన కొత్త చిత్రం ‘డెవిల్’ విడుదలైంది కూడా. ఆ సినిమాను సెలబ్రేట్ చేసిన అభిమానులు.. దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.

ఐతే ఈ కేసులో దర్శన్ మరింత ఇరుక్కుపోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు నిందితుల్లో ఒకడైన ప్రదోష్ అప్రూవర్‌గా మారడం గమనార్హం. రేణుక స్వామి హత్య కేసు నిందితుల్లో ప్రదోష్ 14వ నిందితుడిగా ఉన్నాడు. రెండేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడట. కేసుకు సంబంధించిన నిజాలన్నీ బయటపెడతానని.. తనకు విముక్తి కల్పించాలని కోరుతూ అతను కోర్టును ఆశ్రయించాడు.

ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలోనే అధికారికంగా నమోదు చేస్తారని తెలుస్తోంది. ఈ వాంగ్మూలం ఆధారంగా దర్శన్ మీద నేర నిరూపణకు పోలీసులకు అవకాశం చిక్కినట్లే అని.. దీంతో ఈ కేసులో అతను ఇరుక్కుపోవడం ఖాయమని అంటున్నారు. దర్శన్‌ సన్నిహితురాలైన పవిత్ర అనే నటికి అభ్యంతరకర సందేశాలు పంపి, ఆమెను వేధించినందుకు దర్శన్.. తన మనుషులతో రేణుక స్వామిని తీవ్రంగా హింసించి హత్య చేయించాడన్నది అతడి మీద ఉన్న అభియోగం.