కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ దక్కించుకుంటాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘అన్బే శివం’ ఆ కోవకు చెందిన సినిమానే. తెలుగులో ‘సత్యమే శివం’ పేరుతో రిలీజైన ఈ చిత్రాన్ని చూస్తే.. మనసున్న ప్రేక్షకులు ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఈ చిత్ర కథ, పాత్రలతో వ్యక్తీకరించిన తీరు అద్భుతం.
‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ అనే హాలీవుడ్ మూవీ నుంచి థీమ్ తీసుకుని, కమల్ హాసన్ అద్భుతమైన స్క్రిప్టు అందించడమే కాక.. ప్రధాన పాత్రలో గొప్పగా నటించారు. మాధవన్ కూడా ఆయనతో పోటీ పడి యాక్ట్ చేశాడు. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే ఈ సినిమాకు ప్రశంసలు తప్పితే కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. థియేటర్లలో ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది. దర్శకుడిగా మంచి పనితనమే చూపించినప్పటికీ.. సుందర్.సి ఈ చిత్రం తర్వాత బాగా ఇబ్బంది పడ్డాడు. తన కెరీర్‌ను ఈ సినిమా దెబ్బ తీసిందని కూడా కొన్ని సందర్భాల్లో సుందర్ చెప్పుకున్నాడు.
ఐతే నిజానికి ఈ సినిమాను ముందు ముందు దర్శకుడిగా అనుకున్నది కె.ఎస్.రవికుమార్‌ను అట. ఆయన ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాల్సిందట. అంతే కాదు మొదట మాధవన్ చేసిన పాత్రను మోహన్ లాల్‌తో చేయించాలని కూడా అనుకున్నారట. ఐతే కథ విషయంలో కమల్‌తో ఏకాభిప్రాయం కుదరక తాను తప్పుకున్నట్లు మాధవన్‌తో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో రవికుమార్ వెల్లడించాడు.
ఈ సినిమా క్లైమాక్స్‌లో తన ప్రియురాలిని కొత్త మిత్రుడికి ఇచ్చి పెళ్లి చేయడమే కాక, కార్మికులకు సాయం చేసి వెళ్లిపోతాడు కమల్. ఆ సన్నివేశంతో ఆ పాత్ర గొప్పదనం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఐతే ఇలా సినిమాను ముగించడం రవికుమార్‌కు నచ్చలేదట.
చివరికి హీరో.. స్నేహితుడికి ప్రియురాలిని ఇచ్చేసి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని తాను కమల్‌తో వాదించానని, ఐతే మీకు నచ్చకపోయినా పర్వాలేదని, కథ ఇలాగే ముగియాలని కమల్ స్పష్టం చేశాడని.. దీంతో తాను ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశానని రవికుమార్ తెలిపాడు. ఐతే సినిమా చూసిన ఎవ్వరికైనా ఇప్పుడు సినిమాలో ఉన్న క్లైమాక్సే కరెక్ట్ అనిపించకమానదు. కానీ రవికుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి కమల్, మోహన్ లాల్ కలిసి నటించి ఉంటే మాత్రం సినిమా కమర్షియల్‌గా పెద్ద రేంజికి వెళ్లేదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates