పెద్ద హీరోల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలు అయిపోతుంటారు. ఇందుకు ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీ మినహాయింపు కాదు. ముఖ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఈ ఒరవడి బాగా ఉంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం మించిపోయి నంబర్ వన్ హీరోగా ఎదిగిన విజయ్.. తన కొడుకు జేసన్ విజయ్‌ను కూడా హీరోయే చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ విజయ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోగా.. అదే సమయంలో అందరికీ పెద్ద షాకిస్తూ జేసన్ దర్శకుడిగా రంగప్రవేశం చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సిగ్మా అనే సినిమాను రూపొందించాడు. హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నేరుగా దర్శకుడిగా అరంగేట్రం చేశాడంటే.. జేసన్ ఆ బాటలోనే సాగిపోతాడని, నటనలోకి రాడేమో అని విజయ్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తండ్రి బాటలో తానూ హీరో అవుతానని జేసన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విజయ్ అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. దర్శకులుగా ప్రయాణం మొదలుపెట్టి తర్వాత హీరోలైన ప్రదీస్ రంగనాథన్, అభిషాన్ జీవింత్ (టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్)ల బాటలో తాను కూడా నటనలోకి రావాలనుకుంటున్నట్లు జేసన్ తెలిపాడు.
తాను భవిష్యత్తులో నటుడిగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేయాలనుకుంటున్నట్లు.. రెంటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని భావిస్తున్నట్లు జేసన్ తెలిపాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన సిగ్మా ఈ నెల 31నే విడుదల కావాల్సింది. ఐతే ఈ నెల 23న విజయ్ చివరి చిత్రం జననాయగన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దాంతో క్లాష్ వద్దని తన సినిమాను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నాడు జేసన్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates