భయపెడుతున్న అమెరికా బాక్సాఫీస్

ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా తయారైంది. మన సినిమాలు అలవోకగా మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం మొదలుపెట్టాయి. బాహుబలి: ది కంక్లూజన్ ఏకంగా 20 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి సంచలనం రేపింది. కొన్ని చిన్న సినిమాలు సైతం మిలియన్ క్లబ్బుల్లోకి అడుగుపెట్టి ఔరా అనిపించాయి. నేచురల్ స్టార్ నాని లాంటి వాళ్లకు యుఎస్‌లో మిలియన్ క్లబ్ అన్నది కేక్ వాక్ అయిపోయింది. మొత్తంగా మన సినిమాలకు అక్కడ పెద్ద మార్కెటే క్రియేట్ అయింది. 

కొన్ని సినిమాలు అసాధారణ వసూళ్లు రాబట్టడం చూసి.. నిర్మాతలు రేట్లు పెంచేశారు. ఒక దశ వరకు యుఎస్ బయ్యర్లు కూడా ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి సినిమాలు తీసుకున్నారు. కానీ ఈ మధ్య అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక పెట్టిన ఆంక్షలు, మార్చిన విధానాలతో యుఎస్‌లో భారతీయుల ఉద్యోగాలపై గట్టి ప్రభావమే పడడడంతో ఇంతకుముందులా అక్కడి వాళ్లు వేలం వెర్రిగా సినిమాలు చూడట్లేదని, ఆచితూచి ఖర్చు పెడుతున్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాల వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

2026 పరిస్థితే చూస్తే.. ఇప్పటిదాకా 8 నెలల్లో యుఎస్‌లో నిఖార్సయిన హిట్ అంటే ‘మా ఇంటి బంగారం’ మాత్రమే అన్నది ట్రేడ్ వర్గాల మాట. ఆ చిత్రం మాత్రమే పెట్టుబడిని వెనక్కి తేవడంతో పాటు మంచి లాభాలు అందించింది. అది కాకుండా మరే సినిమా కూడా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టలేదట. సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా యుఎస్‌లో బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది తప్ప.. ఎక్కువ లాభాలేమీ తెచ్చిపెట్టలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. 

అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు ఓవరల్‌గా హిట్లే కానీ.. యుఎస్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. డెకాయిట్ కూడా పెద్దగా ఆడలేదు. ఇక ‘పెద్ది’ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో హిట్టయి.. యుఎస్‌లో డిజాస్టర్ అయింది. ఆ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగమే వెనక్కి వచ్చింది. మొత్తంగా చూస్తే యుఎస్‌లో సినిమా వ్యాపారం పెద్ద జూదంగా మారిపోయిందని.. ఒకప్పటితో పోలిస్తే సినిమాల వసూళ్లు తగ్గాయని.. రీజనబుల్ రేట్లతో సినిమాను కొని, చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప లాభాలు రావడం కష్టంగా మారిందని అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు.