యంగ్ హీరోకు త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన షాక్

దేశంలో తెలుగు ప్రేక్ష‌కులంత పెద్ద మ‌న‌సు ఇంకెవ‌రికీ ఉండ‌దంటూ ఇత‌ర భాష‌ల ఫిలిం మేక‌ర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా త‌మిళ సినిమాల డ‌బ్బింగ్ వెర్ష‌న్ల కోసం ఇక్క‌డికి వ‌చ్చే కోలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ ఈ మాటే అంటుంటారు. కానీ మ‌నం ఇక్క‌డ త‌మిళ సినిమాల‌ను నెత్తిన పెట్టుకుంటుంటే.. మ‌న సినిమాల‌ను మాత్రం వాళ్లు ప‌ట్టించుకోరు.

బాహుబ‌లి, పుష్ప లాంటి ఒక‌టీ అరా సినిమాలు మిన‌హాయిస్తే తమిళనాట తెలుగు సినిమాలు ఆడ‌వు. బాహుబ‌లికి ముందు రాజ‌మౌళి నుంచి వ‌చ్చిన మ‌గ‌ధీర‌, ఈగ చిత్రాల‌కు కూడా తమిళంలో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీని గురించి యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌ర‌చుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటాడు. మ‌న సినిమాల‌కు త‌మిళ‌నాట అస‌లు థియేట‌ర్లే ఇవ్వ‌క‌పోవ‌డంపై గ‌తంలో అత‌ను స్టేజ్ మీద‌, ఇంట‌ర్వ్యూల్లో ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా త‌న కొత్త చిత్రం చెన్నై ల‌వ్ స్టోరీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో మీడియాకు ఇంట‌ర్వ్యూలిస్తున్న అతను.. ఇదే టాపిక్ మీద మాట్లాడాడు. సూర్య సినిమా క‌రుప్పుకి తెలుగులో కావాల్సిన‌న్ని థియేట‌ర్లు దొరికాయ‌ని, ఆ చిత్రం తెలుగులో బాగా ఆడింద‌ని.. కానీ అఖిల్ సినిమా లెనిన్‌కు త‌మిళ‌నాట థియేట‌ర్లు ఇచ్చి అది బాగా ఆడితే, అత‌డికి మార్కెట్ పెరుగుతుంది క‌దా అని కిరణ్ అన్నాడు. మ‌నం ఇత‌ర భాషా చిత్రాల‌ను ఇలా నెత్తిన పెట్టుకుంటుంటే.. మ‌న సినిమాల‌కు మాత్రం ఇత‌ర రాష్ట్రాల్లో స‌రిప‌డా థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోడం ఏంట‌ని అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఇదే విష‌య‌మై ఒక త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ద‌గ్గ‌ర త‌న బాధ చెప్పుకుంటే.. తాము కావాలంటే తెలుగు సినిమాల‌కు థియేట‌ర్లు ఇస్తామ‌ని.. కానీ త‌మిళ జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చి తెలుగు డ‌బ్బింగ్ సినిమాలు చూడ‌ర‌ని ఖ‌రాఖండిగా చెప్పేశాడ‌ని.. ఆయ‌న అంత ఓపెన్‌గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాక మ‌నం ఇక ఏం మాట్లాడ‌తామని కిరణ్ వ్యాఖ్యానించాడు.