బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆనంద్‌లను పెట్టి ఈ సినిమా తీస్తే ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. బేబీ రిలీజైన కొన్ని నెలలకే అదే హీరో హీరోయిన్లతో సాయి రాజేష్ సినిమా అనౌన్స్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై అమితాసక్తి వ్యక్తమైంది. ఈ చిత్రానికి స్క్రిప్టు సాయి రాజేష్‌దే కాగా.. దర్శకుడిగా రవి నంబూరిని ఎంచుకున్నాడు. బేబీకి తనతో కలిసి ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్న ఎస్కేఎన్‌ను ఇందులోనూ భాగస్వామిని చేశాడు.
కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు ఇబ్బందులు తలెత్తాయి. దీన్నుంచి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తప్పుకున్నారు. ఆ టైంలోనే వైష్ణవిని ఉద్దేశించి ఎస్కేన్ పరోక్షంగా విమర్శలు చేయడంతో ఏదో తేడా జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా వైష్ణవి తనకు బేబీ లాంటి హిట్ ఇచ్చిన టీంకి కృతజ్ఞతగా లేదని, ఈ సినిమా నుంచి తప్పుకొందనే చర్చ జరిగింది. ఐతే తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా చెన్నై లవ్ స్టోరీ పేరుతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మీడియాను కలిసిన టీంకు లీడ్ పెయిర్ మార్పు గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి దర్శక నిర్మాత సాయి రాజేష్ బదులిచ్చాడు.
చెన్నై లవ్ స్టోరీ వేరే హీరో హీరోయిన్లతో చేయాలనుకున్న మాట వాస్తవమే అని.. ఐతే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఇబ్బంది తలెత్తిందని సాయిరాజేష్ చెప్పాడు. ఒక ప్రాజెక్టు అనుకుంటే.. అది రెండేళ్లయినా మూడేళ్లయినా దానికి కట్టుబడి ఉండాలని, అది తన పద్ధతి అని.. కానీ అందరూ ఇలా ఉండరు కదా అని సాయిరాజేష్ అన్నాడు.
కొందరికి వెంటవెంటనే సినిమా చేసేయాలని ఉంటుందని.. ఎక్కువ కాలం ఎదురు చూడలేరని.. అలాంటి పరిస్థితుల్లోనే వేరే వాళ్లతో సినిమా చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. కానీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసుకుంటే.. కిరణ్ అబ్బవరం తప్ప ఇందులో ఇంకో హీరోను ఊహించుకోలేకపోతున్నామని.. శ్రీ గౌరీప్రియ కూడా హీరోయిన్ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని.. సినిమాకు అన్నీ బాగా కుదిరాయని సాయిరాజేష్ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates