వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా తాను చేసిన ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారాయన. ఆయ‌న న‌ట కౌశ‌లం గురించి చెప్ప‌డానికి ప‌దుల సంఖ్య‌లో పాత్ర‌లున్నాయి. కానీ గత రెండు దశాబ్దాలుగా ఆయన ప్రతిభను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదు. 

మోహన్ బాబు కూడా సరైన సినిమాలు చేయక.. ఎక్కువ సమయం సినిమాలకు దూరంగా ఉంటూ తన అభిమానులను నిరాశకు గురి చేశారు. అప్పుడ‌ప్పుడూ త‌న ఫ్యామిలీ సినిమాల్లో మాత్ర‌మే మెరుస్తున్న ఆయ‌న‌.. ఇక ఎప్ప‌టికీ బ‌య‌టి సినిమాల్లో చేయ‌రేమో అనుకున్నారంతా. కానీ త‌క్కువ గ్యాప్‌లో రెండు బ‌య‌టి చిత్రాలు ఒప్పుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అందుల ఒక‌టి శ్రీనివాస మంగాపురం. గ‌త గురువార‌మే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఆర్ఎక్స్ 100, మంగ‌ళ‌వారం చిత్రాల ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి డైరెక్ష‌న్.. అది కూడా కృష్ణ కుటుంబం నుంచి వ‌స్తున్న కొత్త హీరో జైకృష్ణ సినిమా అన‌గానే మోహ‌న్ బాబు పాత్ర చాలా స్పెష‌ల్‌గా ఉంటుంద‌ని.. ఆయ‌న పెర్ఫామెన్స్ పేలిపోతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఈ విల‌క్ష‌ణ న‌టుడు చేసిన వెంక‌ట‌ప్ప నాయుడు పాత్ర‌లో ఏ ప్ర‌త్యేక‌తా లేదు. బ‌ళ్ళారిని గుప్పెట్లో పెట్టుకున్న గూండా త‌ర‌హా పాత్ర‌ను చాలా పేల‌వంగా తీర్చిదిద్దాడు అజ‌య్. మోహ‌న్ బాబు గెట‌ప్, న‌ట‌న బాగున్నా.. క‌థ‌లో కానీ, ఆయ‌న పాత్ర‌లో కానీ విష‌యం లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్ర‌భావం క‌నిపించ‌లేదు. 

మోహ‌న్ బాబును ఈ సినిమాలో పూర్తిగా వేస్ట్ చేసేశారనే ఫీలింగ్ ఆయ‌న అభిమానుల‌కు క‌లిగింది. ఆయ‌న వ‌ల్ల సినిమాకు కానీ, సినిమా వ‌ల్ల ఆయ‌న‌కు కానీ ఏ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. దీంతో ఇక నాని సినిమా ది ప్యార‌డైజ్ మీదే మోహ‌న్ బాబు ఫ్యాన్స్ ఆశ‌లు నిలిచి ఉన్నాయి. అందులో ఆయ‌న శిఖంజ మాలిక్ అనే పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్యారెక్ట‌ర్ లుక్స్ భ‌లేగా అనిపించాయి. ఓవ‌రాల్‌గా ది ప్యార‌డైజ్ ప్రోమోలు కూడా ఒక రేంజిలో ఉన్నాయి. ఈ మూవీ నుంచి త్వ‌ర‌లో టీజ‌ర్ రాబోతోంది. అందులో మోహ‌న్ బాబు పాత్ర ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ నెల‌కొంది.

సినిమాలో కూడా మోహ‌న్ బాబు పాత్ర ఆయ‌న‌ స్థాయికి త‌గ్గ‌ట్లే ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పాత్ర ఇంపాక్ట్ చూపించ‌క‌పోతే మోహ‌న్ బాబుకు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. ఆయ‌న సింపుల్‌గా ఇక సినిమాలు ఆపేసి సైలెంట్ అయిపోవ‌చ్చు. కానీ అంత గొప్ప న‌టుడిని చాలా ఏళ్ల పాటు స‌రిగ్గా వాడుకోలేక‌పోయిన ఇండ‌స్ట్రీకి.. ఈ క్యారెక్ట‌ర్ ఫెయిలైతే చాలా న‌ష్ట‌మే జ‌రుగుతుంది.

ఆ పాత్ర పండి, మోహ‌న్ బాబు త‌న‌దైన శైలిలో విజృంభించారంటే మాత్రం మోహ‌న్ బాబు న‌ట‌న‌ను ఎంతో ఇష్ట‌ప‌డే ముందుత‌రం ప్రేక్ష‌కులకు అదెంతో సంతోషాన్నిస్తుంది. అలాగే ఈ త‌రం ప్రేక్ష‌కులకు ఆయ‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.