మసూద దర్శకుడు… ఎట్టకేలకు

తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్ కమింగ్ ఆర్టిస్టులైన తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించగా.. సంగీత, బాంధవి శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు. బడ్జెట్ కూడా చాలా తక్కువే పెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో వణికించింది.

రియల్ హార్రర్ అంటే ఇదీ అనే ఫీలింగ్ కలిగించిన చిత్రమిది. థియేటర్లలోనే కాక ఓటీటీలోనూ మసూద సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఐతే ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా చాలా మంచి పేరు సంపాదించాడు సాయికిరణ్. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడికి వెంటనే అవకాశాలు వస్తుంటాయి. ఆ డైరెక్టర్ కూడా చకచకా సినిమాలు చేయాలనే చూడాలి. కానీ సాయికిరణ్ మాత్రం నాలుగేళ్లు అడ్రస్ లేకుండా పోయాడు.

అందరూ మరిచిపోయిన టైంలో సాయికిరణ్ మళ్లీ వచ్చాడు. ఈసారి అతను అక్కినేని నాగచైతన్య లాంటి స్టార్‌తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. సాయికిరణ్ మళ్లీ హార్రర్ నేపథ్యమున్న సినిమానే చేయనున్నాడట. ఇందులో కొంచెం థ్రిల్లర్ లక్షణాలు కూడా ఉంటాయట. సాయికిరణ్ చెప్పిన కథ చైతూకు బాాగా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చైతూ చేస్తున్న ‘వృషకర్మ’ సినిమా, ‘దూత-2’ వెబ్ సిరీస్ రెండూ హార్రర్ టచ్ ఉన్న కథలే. అలాంటిది మళ్లీ ఇంకో హార్రర్ సినిమా చేయబోతున్నాడంటే విశేషమే. ఐతే చైతూ ఖాళీ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ‘వృషకర్మ’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ‘దూత-2’ ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ రెండూ పూర్తయ్యాక చైతూ.. సాయికిరణ్ సినిమా చేసే అవకాశముంది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్నది ఇంకా ఖరారవ్వలేదు.