సీనియర్ హీరోని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది

ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి, మానసిచ్చి చూడు, కోరుకున్న ప్రియుడు, స్నేహితులు మొదలైనవి పెద్ద విజయాలు సాధించాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ వారసులు కొత్తగా వచ్చిన టైంలో వాళ్ళ పోటీని తట్టుకుని మరీ సక్సెస్ ఇచ్చిన ట్రాక్ రికార్డు నవీన్ సొంతం. తర్వాత వరస ఫ్లాపులు, బిజినెస్ చూసుకోవాలనే నిర్ణయాలు ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద బ్రేక్ తీసుకునేలా ప్రేరేపించాయి.

సరే అయిందేదో అయ్యింది ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేద్దామని ఆయనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు తీయించారు. బొమ్మ ఆడలేదు. ఒక మాములు క్రైమ్ థ్రిల్లర్ కి కమర్షియల్ కోటింగ్ ఇచ్చిన దర్శకుడు ఏ వర్గాన్ని మెప్పించలేకపోయాడు. ఫలితంగా డిజాస్టర్ పడింది. చాలా మంది థియేటర్లలో చూడలేదు. ఇటీవలే ఓటిటిలో వచ్చాక ఒక లుక్ వేద్దామని చూశారు. అంతే సోషల్ మీడియాలో నవీన్ వడ్డే డాన్సుల మీద ట్రోలింగ్ మొదలై వైరల్ గా మారిపోయింది.

నిజానికి నవీన్ వడ్డే వేసింది ట్రయిల్ మాత్రమే. అది కూడా స్వంత డబ్బులతో. కథలో భాగంగా డాన్సులు ఫైట్లు అన్నీ చేశారు. కానీ జనాలకు నచ్చలేదు. కొన్ని మూమెంట్స్ బాలేవు. కరెక్టే. అంత మాత్రాన అదే పనిగా ఆ వీడియోలను తీసుకొచ్చి ట్రోల్ చేయడం చూస్తుంటే జెన్ జీ బ్యాచ్ లో అమాయకత్వం కనిపిస్తోంది. ఎందుకంటే నవీన్ ఎలాంటి వివాదాల్లో లేడు. ప్రత్యేకంగా అభిమానులు ఎవరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. అలాంటప్పుడు ఇదంతా అనవసరం.

ఇప్పుడున్న సీనియర్ హీరోలలాగే తను కూడా మాస్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. కాకపోతే ట్రీట్ మెంట్ బాలేదు. ఇదే ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు బాగుంటే ఇవాళ నవీన్ వడ్డే కంబ్యాక్ అంటూ హడావిడి చేసేవాళ్ళుగా. ఆయన ఇంకో సినిమా తీస్తాడో లేదో కానీ ఎక్స్, ఇన్స్ టాలో తన మీద జరుగుతున్న రీల్స్, ట్వీట్స్ చూస్తే మటుకు ఆలోచనలో పడటం ఖాయం. అంతగా భయపెట్టేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా నవీన్ వడ్డేతో మరో సినిమా ప్లానింగ్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్.