ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించగానే కలకలం రేగింది. తమిళనాట విజయ్ సైతం ఇలాగే అభిమానులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జనాలకు చేరువయ్యాడని.. తారక్ కూడా ఇదే బాటలో సాగుతున్నాడనే విశ్లేషణలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఐతే ఈ కార్యక్రమంతో కానీ, ఆ అసోసియేషన్‌తో కానీ తారక్‌కు సంబంధం లేదన్నట్లుగా ఆయన టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో ఈ చర్చ సద్దుమణిగినట్లే భావించారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ పేరుతో వచ్చిన ప్రెస్ నోట్ విషయమై రా ఎన్టీఆర్ అసోసియేషన్‌ను నడుపుతున్న అభిమాని ఒక టీవీ ఛానెల్లో ఎదురు దాడి చేశాడు. అసలు ఎన్టీఆర్‌కు ఆ ప్రెస్‌నోట్‌తో సంబంధం ఉందా అని ఆ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. ప్రెస్‌నోట్‌లో ఎన్టీఆర్ సంతకం కూడా లేదని.. కావాలంటే ఇలాంటి నోట్ తాను కూడా రిలీజ్ చేయగలనని అతనన్నాడు.
తనకైతే హీరో ఫోన్ చేసి ఇవన్నీ ఆపేయమని చెప్పలేదని.. ఎన్టీఆర్ నేరుగా చెబితేనే ఆయనకు ఇదంతా ఇష్టం లేదని భావించాల్సి ఉంటుందన్నట్లుగా అతను మాట్లాడాడు. తారక్ వద్దంటే అన్నీ ఆపేసి ఎవరి పని వాళ్లు చూసుకుంటామన్నాడు.
ఆరేళ్లుగా తాము ఈ అసోసియేషన్‌ను నడుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఇప్పుడిలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. ఇది 40 వేలమంది వాలంటీర్లను అవమానించడమే అని ఆ అభిమాని వ్యాఖ్యానించాడు. తిరుపతికి చెందిన ఒక పెద్ద మనిషి తన ఫొటోకు చెప్పుల దండ వేయించి వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నాడంటూ అతను మండపడ్డాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates