సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్.. మంగ‌ళ‌వారం గుండెపోటుతో క‌న్నుమూశారు. ముంబ‌యిలోని త‌న నివాసంలోనే ప్ర‌దీప్ రావ‌త్ తుది శ్వాస విడిచారు. వ‌య‌సు ఎక్కువైన‌ప్ప‌టికీ, చాలా ఫిట్‌గా కనిపిస్తూ ఆరోగ్యంగానే ఉన్న ప్ర‌దీప్ ఇలా హ‌ఠాత్తుగా క‌న్నుమూయ‌డం సినీ వ‌ర్గాలకు పెద్ద షాకే.

ఆయ‌న కొన్ని నెల‌ల ముందే త‌రుణ్ భాస్క‌ర్ సినిమా గాయ‌ప‌డ్డ సింహంలో మెరిశారు.గ‌త ఏడాది బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఛావాలోనూ కీల‌క పాత్ర పోషించారు. కొన్నేళ్ల ముందు మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీర‌య్య‌లోనూ న‌టించారు. ప్ర‌దీప్‌కు భార్య క‌ళ్యాణి రావ‌త్, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ప్ర‌దీప్ 80వ ద‌శ‌కం నుంచే హిందీ చిత్రాల్లో న‌టిస్తున్నప్ప‌టికీ.. ఆయ‌న కెరీర్ ఊపందుకుంది 2000 త‌ర్వాతే. ముఖ్యంగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా న‌టించిన సై సినిమా ప్ర‌దీప్ రావ‌త్ కెరీర్‌ను గొప్ప మ‌లుపు తిప్పింది. ఆ సినిమాలో భిక్షు యాద‌వ్ పాత్ర‌లో ప్ర‌దీప్ పండించిన విల‌నీ గురించి, ఆ పాత్ర వేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెర మీద పాత్ర‌ల‌నే కాదు.. ప్రేక్ష‌కుల‌ను కూడా భ‌య‌పెట్టేలా సాగిన ఆయ‌న విల‌నీకి నంది అవార్డ్, ఫిలిం ఫేర్ అవార్డ్ ద‌క్కాయి.

ఆ ఒక్క సినిమా ఆయ‌న్ని సౌత్ ఇండియ‌న్ సినిమాలో బిజీ ఆర్టిస్టును చేసి, వంద సినిమాల దాకా న‌టించేలా చేసింది. భ‌ద్ర‌, ఛ‌త్ర‌పతి, గజినీ, అంద‌రివాడు, స్టాలిన్, దేశ‌ముదురు ఇలా ఎన్నో పెద్ద సినిమాల్లో ప్ర‌దీప్ రావ‌త్ విల‌న్ పాత్ర‌ల‌తో అల‌రించారు. ఐతే కేవ‌లం తాను విల‌నీకే ప‌రిమితం కాద‌ని చాటుతూ నేను శైల‌జ స‌హా కొన్ని చిత్రాల్లో కామెడీ రోల్స్ కూడా చేసి మెప్పించారు ప్ర‌దీప్. ఐతే ఎన్ని పాత్ర‌లు చేసినా, భిక్షు యాద‌వ్‌గానే ఎక్కువ గుర్తుండే ప్ర‌దీప్.. ఆరోగ్యంగా ఉండ‌గానే, ఇంకా సినిమాల్లో న‌టిస్తున్న స‌మ‌యంలోనే ఇలా హ‌ఠాత్తుగా చ‌నిపోవడం బాధాక‌రం.