ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆమె ప్రధాన పాత్రలో చాలా సినిమాలే వచ్చాయి కానీ.. అందులో సానికాయితం లాంటి ఒకటీ అరా సినిమాలు తప్ప ఆకట్టుకోలేకపోయాయి. అయినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఆమె వదిలేయట్లేదు. ప్రస్తుతం తెలుగులో రౌడీ జనార్దనతో పాటు అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న కీర్తి.. తాజాగా ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్టులో భాగమైంది.
తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించబోయే కొత్త లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఆమె నటించనుంది. ఆ సినిమా పేరు.. డొరోతీ.
ఇందులో సనంత్, రిషికాంత్ అనే యువ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మేల్ ఆర్టిస్టులు కూడా కీలక పాత్రలు చేస్తున్నా.. లీడ్ రోల్ మాత్రం కీర్తిదే అనిపిస్తోంది.పిజ్జా, జిగర్ తండ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీక్.. తర్వాత పేట, మహాన్, రెట్రో లాంటి పెద్ద సినిమాలు రూపొందించాడు.
క్రమంగా అతడి సక్సెస్ రేట్ తగ్గినప్పటికీ.. కార్తీక్ సినిమాలంటే చాలా కొత్తగా ఉంటాయనే పేరుంది. తన కథలు అంచనాలకు అందని రీతిలో ఉంటాయి. ఇలాంటి దర్శకుడు కీర్తి లాంటి పెర్ఫామర్‌తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాడంటే అది చాలా స్పెషలే.
ఇంతకుముందు కీర్తి ప్రధాన పాత్రలో పెంగ్విన్ అనే ఓటీటీ మూవీని ప్రొడ్యూస్ చేశాడు కార్తీక్. అది నిరాశపరిచింది. ఇప్పుడు తనే ఆమెను డైరెక్ట్ చేయబోతున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించనుండడం మరో విశేషం. తిరు లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చనున్నాడు. బాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయనున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates