నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం.. నాగబంధం. గత వారం విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఉన్నంతలో మంచి వసూళ్లే సాధించింది. కథాకథనాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ.. సాంకేతికంగా మాత్రం ఈ చిత్రం గొప్పగా రూపొందింది. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రానికి ఒక కొత్త సంగీత దర్శకుడు పని చేశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అతనే జునైద్ కుమార్.

‘నాగబంధం’ చిత్రానికి అతనందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అతి పెద్ద బలం అనడంలో సందేహం లేదు. పెద్ద సంగీత దర్శకులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఔట్ పుట్ ఇచ్చిన జునైద్.. సినిమాలో ముఖ్య సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్లో బీజీఎం హైలైట్ అని చెప్పొచ్చు. జునైద్ పాటల్లో ‘నమోరే’ కూడా ఆకట్టుకుంది. జునైద్ పేరు ప్రేక్షకులకు కొత్తే కానీ.. ఇండస్ట్రీకి మాత్రం తన టాలెంట్ బాగానే తెలుసు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు అతను శిష్యుడు కావడం విశేషం. అరంగేట్రంలోనే ఇంత భారీ ప్రాజెక్టుకు సంగీతం అందించే అవకాశం అందుకోవడం గురించి.. తన నేపథ్యం గురించి జునైద్ మాట్లాడాడు.

‘‘నేను పక్కా హైదరాబాదీని. మా తాత సంగీత దర్శకుడే. ఆయన పేరు.. సజన్. హిందీలో అనేక కమర్షియల్స్‌కు మ్యూజిక్ చేశారు. ఆయనే నాకు సంగీతం మీద ఆసక్తి కలిగేలా చేశారు. చిన్నప్పుడే ఎన్నో అద్భుతమైన పాటలు వినిపించారు. తర్వాత నాకు సంగీతమే ప్రపంచమైంది. రకరకాల సంగీత పరికరాల మీద పట్టు సాధించాను. తర్వాత మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాను. ప్రోగ్రామర్‌గా మారాను. నాకు తొలి అవకాశం ఇచ్చింది సురేష్ బొబ్బిలి. ‘విరాటపర్వం’తో పాటు కొన్ని చిత్రాలకు ఆయన దగ్గర పని చేశాను. నేను మణిశర్మ గారికి పెద్ద ఫ్యాన్. నాకు ఆయన దేవుడన్నట్లే. బొల్లారం నుంచి మణికొండలో ఉన్న సురేష్ గారి స్టూడియోకు వెళ్లేటపుడు మధ్యలో ఫిలిం నగర్లో ఉండే మణిశర్మ గారి స్టూడియో ముందు ఆగి గుడిలో దేవుడికి దండం పెట్టుకున్నట్లు మొక్కుకుని వెళ్లేవాడిని. అలాంటిది ఒక టైంలో నాకు ఆయన దగ్గర పని చేసే అవకాశం రావడంతో నాకు మాటలు రాలేదు.

ముందు మణిశర్మ గారి అబ్బాయి మహతి సాగర్ కోసం ఒక ప్రాజెక్టు చేశాను. ఆయన ద్వారా మణిశర్మ గారి సినిమాకు ప్రోగ్రామర్‌గా పని చేసే ఛాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ కోసం నేను చేసిన ట్యూన్ ఆయనకు చాలా నచ్చింది. మరోవైపు కార్తికేయ-2, బలగం సహా పలు చిత్రాలకు ప్రోగ్రామర్‌గా పని చేశాను. మణిశర్మ గారి స్టూడియోలో ఉండగానే ఒక రోజు అభిషేక్ నామా గారు కలిసి.. ఒక గ్లింప్స్‌కు బీజీఎం చేసి ఇవ్వమన్నారు. అదే నాగబంధం.

బీజీఎం చేశాకే ఆ సినిమా గురించి తెలిసింది. గ్లింప్స్ కి నా వర్క్ చూసి ఇంప్రెస్ అయి.. ఈ సినిమాకు నన్నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు అభిషేక్. తొలి సినిమానే ఇంత పెద్దది చేస్తానని ఊహించలేదు. ఈ సినిమా కోసం 400- 500 ఏళ్ల కిందటి సంగీత పరికరాల గురించి పరిశోధన చేశాం. రెగ్యులర్ ఇన్‌స్ట్రుమెంట్స్ కాకుండా ప్రత్యేకమైన వైకింగ్ లాంటి పరికరాలను ఉపయోగించాం. నమోరే పాటను కంపోజ్ చేసినప్పటి అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని జునైద్ తెలిపాడు.