ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు. దీంతో బిజినెస్ వర్గాల నుంచి అభిమానుల దాకా అందరూ ఎదురు చూపుల్లో ఉన్నారు. డిసెంబర్ మొదటి వారం అది కూడా మూడో తేదీ రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని నాలుగు రోజుల క్రితం విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోవడం అనుమానాన్ని పెంచింది.
గత ఏడాది ఒక పోస్టర్ వదలడం మినహా ఫౌజీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. అభిమానులే ఒక అడుగు ముందుకేసి ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి దుస్తుల్లో ఉన్న ఏఐ ఇమేజులను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అవి చూస్తే వాళ్ళలో ఎంత అసహనం ఉందో అర్థమవుతుంది. మార్చిలో స్పిరిట్ ఫిక్స్ కావడంతో కనీసం మూడు నెలల ముందు ఫౌజీ వచ్చి హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి అనుకూల వాతావరణమే లేదు.
ముందుగా కుదుర్చుకున్న ఓటిటి డీల్ ప్రకారం ఫౌజీ ఈ ఏడాది చివరిలోగా విడుదల కావాలట. లేదంటే పెద్ద మొత్తంలో ఆఫర్ తగ్గిపోవచ్చు. స్పిరిట్ లో పాల్గొంటూనే ఈ సినిమాను బాలన్స్ చేస్తున్న ప్రభాస్ ఒకే టైంలో రెండు సినిమాలు సెట్స్ మీద పెట్టడం వెనుక గుట్టు ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్ని ఎపిసోడ్స్, పాటలు తప్ప ఫౌజీ దాదాపుగా పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ రషెస్ చూసినవాళ్లు ఎక్స్ ట్రాడినరి రిపోర్ట్స్ చెబుతున్నారని వినికిడి.
ది రాజా సాబ్ దారుణ వైఫల్యం తర్వాత ప్రభాస్ నుంచి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ రావాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో తన బ్రాండ్ మీద నెట్టుకొస్తున్నాడు కానీ లేదంటే రాధే శ్యామ్, సాహో లాంటివి ఇంకా తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టేవి. ఫౌజీ, స్పిరిట్ మీద పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. సరైన టైంకి వస్తే ఏకంగా దురంధర్, పుష్ప 2 రికార్డులను టార్గెట్ చేసుకోవచ్చు. ఎటొచ్చి ఇచ్చిన మాట మీద నిలబడలేకపోవడమే ఈ సమస్యకు మూలం. మరి ఈ ప్రెజర్ తట్టుకుని ఫౌజీ ఎలా బయట పడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
