బెల్లంకొండ శ్రీనివాస్ మన దగ్గర ఒక మిడ్ రేంజ్ హీరో. కొన్నేళ్లుగా అతను పెద్దగా సినిమాలు చేయక రేసులో బాగా వెనుకబడిపోయాడు. అలాంటి హీరోకు ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అదంతా యూట్యూబ్ ద్వారా డబ్ అయిన తన సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ పుణ్యమే. అల్లుడు అదుర్స్ మొదలుకుని శ్రీనివాస్ నటించిన చాలా సినిమాలను గోల్డ్ మైన్ ఫిలిమ్స్ హిందీలో అనువాదం చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం ద్వారా కోట్లు కొల్లగొట్టింది.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే మిగతా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను మించి ఆదాయం వస్తుందంటే అతిశయోక్తి కాదు. మరి తన సినిమాల హిందీ వెర్షన్లకు యూట్యూబ్‌లో ఆ స్థాయిలో ఉంటాయి వ్యూస్. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఏ చిత్రానికి సాధ్యం కాని విధంగా శ్రీనివాస్ సినిమా వంద కోట్ల వ్యూస్ సాధించింది అంటే షాకవ్వక తప్పదు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చితరాన్ని ఖూంఖార్ పేరుతో హిందీలో రిలీజ్ చేయగా.. అది ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ యూట్యూబ్‌లో వంద కోట్ల వీక్షణలు రాలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ చాప్టర్ 1 హిందీ వెర్షన్ 861 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. తెలుగులో జయ జానకి నాయక ఒక మాదిరిగా ఆడింది తప్ప పెద్ద హిట్టేమీ కాలేదు.
కానీ ఈ చిత్రానికి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇదే కాదు.. బెల్లంకొండ నటించిన ఫ్లాప్ సినిమాలకు సైతం యూట్యూబ్‌లో భారీ వ్యూసే ఉన్నాయి. ఈ ఫాలోయింగ్ చూసే బెల్లంకొండను కొన్నేళ్ల ముందు హిందీలో లాంచ్ చేశారు ప్రముఖ నిర్మాత జయంతిలాల్. కానీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన తీసిన ఛత్రపతి రీమేక్ అక్కడ డిజాస్టర్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates