బుల్లిరాజు డిమాండ్ ఇంత భారీగానా

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సామెత హీరో హీరోయిన్లకే కాదు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంతో పరిచయమైన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతగా అంటే ఒక రోజు కాల్ షీట్ కు లక్ష రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. కాల్ షీట్స్ పరిమితంగా తీసుకుని అతని సీన్లను తక్కువ నిడివిలో పూర్తి చేసేలా దర్శకులు చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి.

కేవలం సినిమాలకే కాదు బుల్లిరాజు పాపులారిటీ బుల్లితెరకు కూడా పాకింది. రియాలిటీ షోలకు పిలుస్తున్నారు. పట్టణాల షో రూమ్ ఓపెనింగ్స్ ఉంటే అక్కడ కనిపిస్తున్నాడు. వస్తువుల ప్రకటనలకు బ్రాండ్ అంబాసడర్ గా వాడుకుంటున్నారు. ఇలా రకరకాలుగా రేవంత్ వాడకం జరిగిపోతోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి తనను ప్రెజెంట్ చేసిన తీరు ఓ రేంజ్ లో పేలడంతో ఇదంతా జరిగిందన్న మాట. అన్నట్టు ఈ బుడ్డోడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడట.

అయితే ఈ దూకుడు ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం భరత్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత కన్నా పీక్స్ స్టార్ డం చూశాడు. శ్రీను వైట్ల పేల్చిన ఈ బాంబు కొన్ని సంవత్సరాల పాటు వెలిగింది. తర్వాత వయసు పెరిగే కొద్దీ భరత్ లో వచ్చిన శారీరక మార్పులు అతనిలో బాల్యపు అమాయకత్వాన్ని పోగొట్టాయి. దీంతో హీరోల పక్కన ఫ్రెండ్ గా కొన్ని సినిమాలు చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం భరత్ చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

వీళ్లంతా కాదు కానీ 1990 టైంలో బేబీ షామిలి అందుకున్న మైలురాళ్ళు ఎవరి వల్ల కాదు. అతి చిన్న వయసులో ఇన్కమ్ టాక్స్ కట్టే స్థాయిలో స్టేటస్ అనుభవించడం అంటే మాటలు కాదు. మణిరత్నం, రాఘవేంద్రరావు లాంటి లెజెండ్స్ ఆ పాపను తీర్చిదిద్దిన తీరు నభూతో నభవిష్యత్. అదే షామిలి పెద్దయ్యాక సిద్దార్థ్ ఓయ్ లో హీరోయిన్ గా నటిస్తే పెద్దగా అవకాశాలు రాలేదు. తరుణ్ ఒక్కడే చెప్పుకోదగ్గ సక్సెస్ చూశాడు. మరి బుల్లిరాజు ప్రయాణం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.