ఆచార్య దర్శకుడితో రామ్ చరణ్…

కొన్ని డిజాస్ట‌ర్లు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో ప‌నిచేసిన వాళ్లంద‌రినీ జీవిత కాల చేదు జ్ఞాప‌కాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల కోసం క‌లిసి ప‌ని చేసిన వాళ్ల మ‌ధ్య మాట‌లు లేకుండా.. తీవ్ర విభేదాలు త‌లెత్తేలా చేస్తుంటాయి. ఆచార్య సినిమాను ఈ కోవ‌కు చెందిన సినిమాలాగే భావించారు అంద‌రూ. ఆచార్య రిలీజ్ ముందు వ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో మంచి సంబంధాలుండేవి.

కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో కొర‌టాల‌ను చిరు దూరం పెట్టేశార‌న్న టాక్ న‌డిచింది. సినిమా ఫెయ‌ల్యూర్ బాధ్య‌త‌నంగా కొర‌టాల మీదికి నెట్టేశార‌ని.. ఈ సినిమా న‌ష్టాల భ‌ర్తీలో భాగంగా కొర‌టాల ఆస్తులు అమ్ముకున్నార‌ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు ప్ర‌చారం చేశారు. దీంతో కొర‌టాల.. చిరు, చ‌ర‌ణ్‌ల ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నాడ‌ని.. ఆ ఇద్ద‌రూ కూడా కొర‌టాల విష‌యంలో ప్ర‌తికూల అభిప్రాయంతోనే ఉన్నార‌ని ఊహాగానాలు వినిపించాయి.

ఐతే ఈ ప్ర‌చారంలో ఎంత మేర నిజం ఉందో అని సందేహం క‌లిగేలా బుధ‌వారం ఒక క‌ల‌యిక జ‌రిగింది. ఆచార్య‌లో కీల‌క పాత్ర పోషించిన రామ్ చ‌ర‌ణ్‌.. కొర‌టాల శివ‌ను క‌లిశాడు. చ‌ర‌ణ్ ఆంధ్ర ప్రిమియ‌ర్ లీగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు అమ‌రావ‌తికి వెళ్ల‌గా.. నంద‌మూరి బాల‌కృష్ణతో తాను చేయ‌బోయే కొత్త సినిమా ప్రారంభోత్స‌వం కోసం కొర‌టాల అక్క‌డికి చేరుకున్నాడు.

ఇద్ద‌రూ అనుకోకుండా క‌లిశారా.. లేక అనుకునే క‌లిశారా అన్న‌ది తెలియ‌దు కానీ.. వీరి క‌ల‌యిక మాత్రం ఆస‌క్తి రేకెత్తించింది.
ఏ అర‌మ‌రిక‌లూ లేకుండా చ‌ర‌ణ్‌, కొర‌టాల ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోవ‌డం.. న‌వ్వుకోవ‌డం.. ఇద్ద‌రూ కౌగిలించుకోవ‌డం.. ఇదంతా చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని.. ఆచార్య ఫ‌లితం వీరి మ‌ధ్య ఎలాంటి చిచ్చు పెట్ట‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇటీవ‌ల కొర‌టాల పెద్ది ప్రిమియ‌ర్‌కు కూడా హాజ‌రైన నేప‌థ్యంలో ఇంత‌కుముందు జ‌రిగిన ప్ర‌చారాల‌న్నీ అవాస్త‌వమ‌ని అర్థం చేసుకోవాల‌ని మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.