పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం మీదా దృష్టిపెట్టాలి. ఎక్కడైనా ఆధునికత కనిపించినా, అథెంటిసిటీ లేకపోయినా, కథ పక్కదోవ పట్టినా, పాత్రల ఔచిత్యం దెబ్బ తిన్నా, సినిమా నవ్వుల పాలు అవుతుంది. అందుకే చిన్న చిన్న డీటైలింగ్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటారు. రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని తీస్తున్నపుడు జాగ్రత్త మరింత అవసరం.
ఈ కథ ప్రకారం రాముడి వనవాసం మొదలయ్యాక ఎక్కడా పాదరక్షలు ధరించకూడదు. ఎందుకంటే అయోధ్యను వదిలి వెళ్లేటపుడు రాముడి సోదరుడైన భరతుడు.. తన పాదరక్షలు తీసుకుంటాడు. వాటినే సింహాసనం మీద పెట్టి పాలన సాగిస్తాడు. దీంతో రాముడు పాదరక్షలు లేకుండానే అడవిలో జీవించాల్సి వస్తుంది. కాబట్టి రామాయణ సినిమాలో రాముడి పాత్ర పోషించిన రణబీర్ ఎక్కడా చెప్పులు వేసుకోవడానికి అవకాశం లేకపోయింది.
మరి వట్టి కాళ్లతో నటించడం అంటే తేలికైన విషయం కాదు. ఈ సినిమా చిత్రీకరణ నిజమైన అడవుల్లోనూ చేశారు. సెట్టింగ్స్ వేసి చేసినా సరే.. బేర్ ఫుట్‌తో షూటింగ్‌లో పాల్గొనడం తేలిక కాదు. మరి అప్పుడు ఏం చేశారన్నది ఆసక్తికరం. దీని గురించి రణబీర్ రామాయణ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాలో తన కోసం ప్రత్యేకంగా రబ్బరు చెప్పులు చేయించారన్నాడు. అవి వేసుకునే తాను చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పాడు. లేదంటే యాక్షన్ ఘట్టాలు, ఇతర భారీ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమయ్యేదని అతనన్నాడు.
తర్వాత ఎడిటింగ్ టైంలో సీజీని వాడి ఆ చెప్పులను తీసేశారని.. కాబట్టి తెర మీద మాత్రం తాను పాదరక్షలు లేకుండానే కనిపిస్తానని రణబీర్ వెల్లడించాడు. సీజీలో చెప్పులు జోడించాలంటే కష్టం కానీ, తీసేయడం కష్టం కాదని వీఎఫెక్స్ నిపుణులు చెప్పినట్లు రణబీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించిన రామాయణాన్ని నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా రెండు భాగాలుగా నిర్మించాడు. ఈ ప్రాజెక్టు ఓవరాల్ బడ్జెట్ రూ.4 వేల కోట్లని అంటున్నారు. రామాయణ-1 నవంబరులో దీపావళి కానుకగా విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates