పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న రావ‌డం మామూలే. ఆ పేరు వినిపించిన‌పుడు ఆడిటోరియాలు ఎలా హోరెత్తిపోతాయో తెలిసిందే. లెజెండ‌రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి-2 సినిమాలో ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ రాయ‌డానికి స్ఫూర్తి పొందే స్థాయిలో ఇదొక హిస్టీరియాలా మారిన సంగ‌తి తెలిసిందే. దీని మీద కొన్ని వివాదాలు కూడా న‌డిచిన విష‌య‌మూ విదిత‌మే.

కానీ ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా.. త‌మ‌కు అల‌వాటైన విధంగానే ప్ర‌తి ఈవెంట్లోనూ ప‌వ‌న్ నినాదాల‌తో ఆడిటోరియాలు ద‌ద్ద‌రిల్లేలా చేస్తుంటారు. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ మెగా ఈవెంట్లో ప‌వ‌న్ నినాదాలు ఆడిటోరియాన్ని షేక్ చేశాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొత్త చిత్రం పెద్ది స‌క్సెస్ మీట్లో ఇది జ‌రిగింది.

మెగాస్టార్ చిరంజీవితో పాటు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజ‌రైన పెద్ది స‌క్సెస్ ఈవెంట్లో నిర్మాత స‌తీష్ కిలారు మాట్లాడేట‌పుడు.. త‌మ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశ‌మిచ్చిన ప్ర‌భుత్వాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న తెచ్చారు.

ప‌వ‌న్ పేరెత్త‌గానే అభిమానులు గ‌ట్టిగా అర‌వ‌డం మొద‌లుపెట్టారు. ఎప్ప‌ట్లాగే స్పీక‌ర్ ప్ర‌సంగాన్ని కాసేపు ఆపాల్సి వ‌చ్చింది. అంత‌కంత‌కూ అరుపులు, కేక‌లు పెరిగాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా చేశారు.

ఆ స‌మ‌యంలో చిరు మంద‌హాసంతో చూస్తూ ఉన్నారు. త‌మ్ముడి కోసం అభిమానులు అంత‌గా అరుస్తుంటే ఆయ‌న‌లో సంతోషం క‌నిపించింది. త‌ర్వాత స‌తీష్ ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. టికెట్ల రేట్ల కోసం ప‌వ‌న్‌ను క‌లిసిన‌పుడు, మీ వెనుక నేనున్నా సినిమా రిలీజ్ చేయండి అంటూ మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్లు గుర్తు చేసుకున్నారు.

బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పెద్ది వ‌ర‌ల్డ్ వైడ్ రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి ఫ‌లిఆన్నే అందుకోగా.. మిగ‌తా చోట్ల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.