అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా ‘బ్లాస్ట్ జోన్’ తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా దాని పెట్టుబడి ఈజీగా రికవర్ కావడంతో పాటు మంచి లాభాలు వచ్చాయి. కాకపోతే మరింత పబ్లిసిటీ చేసి ఉంటే ఎక్కువ శాతం రీచ్ అయ్యేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళ సంఖ్య పెద్దదే ఉంది. ఎల్లుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ బ్లాస్ట్ జోన్ అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద హీరో సినిమాలోని హోమ్ ఎపిసోడ్స్ కి, బ్లాస్ట్ జోన్ కి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయనేది కొన్ని రోజులుగా ఎక్స్ ని ఊపేస్తున్న గాసిప్ వార్త. సీనియర్ హీరో, స్టార్ డైరెక్టర్ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ అచ్చం బ్లాస్ట్ జోన్ లాగే ఒక కుటుంబం, విలన్ గ్యాంగ్ మీద పడి ఇంట్లో ఫైట్ చేసే సన్నివేశాలు ఉన్నాయట. అందుకే వాటిలో కీలక మార్పులు చేసి స్క్రీన్ ప్లే దానికి అనుగుణంగా రాస్తున్నారని వినికిడి.

ఇందులో నిజమెంతుందనేది పక్కన పెడితే బ్లాస్ట్ జోన్ కి నెట్ ఫ్లిక్స్ లో వ్యూస్ వర్షం కురవడం ఖాయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ క్రేజీ కంటెంట్ ఏదీ ఓటిటిల్లో రాలేదు. అందుకే దీన్ని పెద్ద ఎత్తున చూస్తారనే అంచనాలున్నాయి. అయితే ఈ కాపీ రైట్ వ్యవహారం నిజంగా జరిగిందా లేక పుకారా అనేది ట్రైలర్ వచ్చాక కానీ అర్థం కాదు. అప్పటిదాకా ఇంకా ఇలా బోలెడు ఊహాగానాలు, పుకార్లు ఆన్ లైన్ వేదికగా చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఇప్పుడీ కారణాలు, రీ షూట్ల వల్ల సదరు పెద్ద హీరో సినిమా అక్టోబర్ లో వస్తుందా రాదానే దాని మీద ఫ్యాన్స్ లో అనుమానాలు తొలగడం లేదు. బ్లాస్ట్ జోన్ మాత్రం అర్జున్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ గా నిలిచింది. సోలో హీరోగా ఆయన ఇంత పెద్ద సక్సెస్ చూసి దశాబ్దాలు గడిచిపోయాయి. అందుకే ఇకపై ప్లానింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అంటున్నారు. తెలుగులో కూతురు ఐశ్వర్య టైటిల్ రోల్ లో ఆయన డైరెక్ట్ చేసిన సీత పయనం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.