షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై షో మీద కేసు గెలిచి 12 వేల రూపాయలు పరిహారంగా పొందటం పట్ల మూవీ లవర్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాకపోతే ఇది తక్షణ న్యాయం అందుకున్న కేసు కాదు. మొన్నటి ఏడాది మోహన్ లాల్ బరోజ్ సినిమాకు వెళ్లిన సదరు ఆడియెన్ కి షో లేదని మల్టీప్లెక్స్ యాజమాన్యం వెనక్కు పంపింది. ఒక గంట ముందుగా ఇన్ఫార్మ్ చేసినా ఏ గొడవ ఉండేది కాదు.

తీరా అతను నగరంలో ట్రాఫిక్ దాటుకుంటూ, తన పనులు మానుకుని అక్కడికొచ్చి చూసేసరికి షో క్యాన్సిల్ చేసి సింపుల్ గా రీ ఫండ్ ఇస్తాం అనేసారు. దీంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేశాడు. కోర్టు తీర్పు ఇస్తూ సమయం కూడా డబ్బుతో సమానమని, షోలు బుకింగ్ లో పెట్టి డబ్బులు తీసుకున్నప్పుడు అవి క్యాన్సిల్ అయితే ముందే చెప్పాల్సిన బాధ్యత కూడా బుక్ మై షోదేనంటూ జడ్జ్ మెంట్ ఇచ్చింది. దీనికి సినీ ప్రియుల నుంచి మంచి మద్దతు దక్కుతోంది.

ఇలాంటివి మరిన్ని జరగాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా చిన్న సినిమాల రిలీజ్ రోజు చాలా చోట్ల జనం లేరనే సాకుతో షోలు రద్దు చేస్తున్నారు. వచ్చిన నలుగురైదుగురిని టికెట్ కౌంటర్ నుంచి వెనక్కు పంపిస్తున్నారు. దీంతో అసలు టాక్ బయటికి రాకుండా జనం వాటి వైపు చూడటం మానేస్తున్నారు. రిలీజ్ రోజు ఒకరు ఇద్దరు వచ్చినా షోలు వేయడం ద్వారా వాళ్ళ నుంచి బయటికి వెళ్లే టాక్ ఇంకో పాతిక మందిని తీసుకొస్తుందనే ప్రాథమిక వాస్తవాన్ని మర్చిపోతున్నారు.

ఇది కనువిప్పుగా మారితే సంతోషమే. ఎందుకంటే పన్నెండు వేల రూపాయలు బుక్ మై షోకు చిన్న మొత్తమే కావొచ్చు కానీ అది డిస్ట్రిబ్యూటర్ కోణంలో చూసుకుంటే షో రన్ చేయడం ద్వారా వచ్చే రెవిన్యూ కంటే ఎక్కువే కావొచ్చు. సో ఇకపై సింపుల్ గా క్యాన్సిల్ అని చెప్పేయడం కాకుండా వీలైనంతగా స్క్రీనింగ్స్ వేసేందుకు మల్టీప్లెక్సులు పూనుకుంటే తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు బ్రతికి బట్టకడతాయి. లేదంటే ఇవి రిపీటవుతూనే ఉంటాయి.