ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన కేసుకు సంబంధించి న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం అనగా జూన్ 22న కోర్టు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 రిలీజ్ రోజున దురదృష్టవశాత్తు సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సమయంలో అభిమానుల రద్దీని అదుపు చేయలేకపోవడం వల్ల అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా చేర్చారు.
ఆ రోజు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే కారణంతో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో పర్సనల్ స్టాఫ్, ప్రైవేట్ బౌన్సర్లు కలిపి మొత్తం 23 మంది పేర్లను ఈ ఛార్జ్ షీట్‌లో పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి విచారణ అధికారులు పక్కా సాక్ష్యాలను కలెక్ట్ చేసి న్యాయస్థానం ముందు ఉంచారు.
సోమవారం నాడు హీరో కోర్టుకు హాజరైన తర్వాత ఈ విచారణకు సంబంధించి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం తరచుగా ముంబై కూడా వెళుతున్నారు. అయితే ఇప్పటికే బాధిత కుటుంబానికి అల్లు తనవైపు నుంచి సహాయం అందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates