హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ పాత్ర జెన్ జీలో పుట్టుకొచ్చింది కాదు. 90 దశకం కార్టూన్ రూపంలో టీవీలో ప్రసారమవుతున్నప్పుడు అప్పట్లోనే కోట్లాది అభిమానులు ఉండేవారు. అలా మెల్లగా రియల్ లైఫ్ క్యారెక్టర్ గా మారిపోయి ఇప్పుడు కనకవర్షం కురిపించే కామధేనువుగా మారిపోయింది. నైన్టీ కిడ్స్ కే కాదు ఇప్పటి తరానికి కూడా ఫేవరెట్ గా మారిపోయిన స్పైడర్ మ్యాన్ సిరీస్ లో కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే ఇండియాలో వసూళ్ల సునామి సృష్టిస్తోందనే మాట చిన్నది
మొదటి రోజు సుమారు 73 కోట్లకు పైగా వసూళ్లు రావడం ట్రేడ్ ని షాక్ కి గురి చేస్తోంది. ఈ స్థాయి హైప్ ముందే ఊహించారు కానీ మరీ ఇంతగా ఎగబడి చూస్తారని ఎవరూ అనుకోలేదు. యాక్షన్ కన్నా ఎమోషన్ ఎక్కువ ఉందని తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం తగ్గేదేలే అంటూ ఎగబడుతున్నారు. ఢిల్లీ నుంచి మన తెలుగు రాష్ట్రాల గల్లీల దాకా అన్ని చోట్ల ఒకటే సీన్ కనిపిస్తోంది. రెండో రోజు గంటకు 45 వేల టికెట్లు అమ్ముడుపోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
చూస్తుంటే ఆల్ టైం రికార్డులు సృష్టించే దిశగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పరుగులు పెట్టేలా ఉంది. బాలీవుడ్ లో ఎలాంటి కాంపిటీషన్ లేకపోవడంతో యునానిమస్ గా షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మన దగ్గర శ్రీనివాస మంగాపురం మీద గట్టి ప్రభావం పడగా మంచి రన్నింగ్ లో ఉన్న చెన్నై లవ్ స్టోరీ కూడా సాలీడు మనిషి వల్ల కలెక్షన్లు తగ్గించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న చిన్న సెంటర్స్ లో ఇబ్బందిగా మారింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్పైడర్ మ్యాన్ ఎప్పటికీ చెక్కుచెదరని ఒక ఎమోషన్. అమెరికా అయినా భారతదేశమైనా ప్రతి చోటా తనకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని నిలబెట్టే దర్శకులు భవిష్యత్తులో ఇంకెందరో రావాలి. స్పైడర్ మ్యాన్ 1, 2 తరహాలో టైటిల్ నుంచి క్లైమాక్స్ దాకా ఊగిపోయే గూస్ బంప్ ఎపిసోడ్స్ తో ఉక్కిరి బిక్కిరి చేయాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. రాను రాను భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల టాక్ ఎఫెక్ట్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

