టాలీవుడ్ గాయాల జాబితాలోకి కొత్త పేరు

ఎన్న‌డూ లేని విధంగా ఈ మ‌ధ్య టాలీవుడ్ స్టార్లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు గాయ‌ప‌డ‌డం ఆందోళ‌నక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమా షూటింగ్‌లో మ‌ణిక‌ట్టు గాయానికి గురై, ఇటీవ‌లే శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. ఈ మ‌ధ్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డారు.

మ‌రోవైపు వ‌రుణ్ తేజ్ సైతం గాయంతో బాధ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఒకే స‌మ‌యంలో ఇంత‌మంది గాయ‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. షూటింగ్‌లో మ‌న హీరోలు అవ‌స‌రానికి మించిన రిస్క్ తీసుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో ఇంకో ఫిలిం సెల‌బ్రెటీ గాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఈసారి గాయ‌ప‌డింది హీరో కాదు.. హీరోయిన్ కావ‌డ‌మే ట్విస్టు. ఆమె ఎవ‌రో కాదు.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్నా.

తాను న‌టిస్తున్న బ‌హు భాషా చిత్రం మైసా కోసం ఒక పాట చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా డ్యాన్స్ చేస్తుండ‌గా.. ప‌ట్టుత‌ప్పిన‌ ర‌ష్మిక‌కు న‌డుము ద‌గ్గ‌ర‌ గాయ‌మైంద‌ట‌. సాధార‌ణంగా అథ్లెట్ల‌కే ఇలాంటి గాయాల‌వుతుంటాయ‌ని.. దాని తీవ్ర‌త దృష్ట్యా ఆరు వారాల పాటు ర‌ష్మిక‌కు వైద్యులు విశ్రాంతి సూచించార‌ట‌. విశ్రాంతితో పాటు చికిత్స తీసుకుంటూ ఆమె కోలుకోవాల్సి ఉంది.

ర‌ష్మిక ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిలిం మైసాతో పాటు త‌న భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ణ‌బాలి సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమెకు తీవ్ర గాయ‌మైన నేప‌థ్యంలో ఈ రెండు సినిమాల షెడ్యూళ్లు దెబ్బ తిన‌బోతున్నాయి. వీటి రిలీజ్ అనుకున్న దాని కంటే చాలా ఆల‌స్యం కావ‌డం ఖాయం. ర‌ణ‌బాలి ఆల్రెడీ సెప్టెంబ‌రు 11 నుంచి వాయిదా ప‌డింది. ఇప్పుడు ర‌ష్మిక గాయం వ‌ల్ల ఆ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌వికి వెళ్లిపోయినా ఆశ్చ‌ర్యం లేదు. మైసా రిలీజ్ డేట్ ఇంకా ఖ‌రారు కాలేదు కానీ.. ఆ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ‌వుతుందా అన్న‌ది సందేహ‌మే.