తారక్ స్థానంలోకి సూర్య?

జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఎప్పట్నుంచో సస్పెన్స్ నడుస్తోంది. ముందేమో ‘దేవర-2’ అన్నారు. తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇంకోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ మూడు ప్రాజెక్టుల విషయంలోనూ అయోమయమే కనిపిస్తోంది.

బాలయ్యతో కొత్త సినిమాకు రెడీ అవుతున్న కొరటాల శివ ‘దేవర-2’ విషయంలో అంత సుముఖంగా లేడని చెబుతున్నారు. ‘దేవర-2’ మీద నిర్మాతలకు కూడా అంత నమ్మకం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ఇక నెల్సన్ మూవీ గురించి ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి తారక్ తప్పుకున్నట్లుగా చెబుతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తారక్.. నెల్సన్ సినిమాను చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తారక్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగాడని.. ఆయన స్థానంలోకి తమిళ స్టార్ హీరో సూర్య వచ్చాడని చెబుతున్నారు. సూర్య ఇప్పటికే సితార సంస్థలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా చేస్తూ నాగవంశీతో ఆయనకు మంచి అనుబంధమే ఏర్పడిందని.. దీంతో ఇదే బేనర్లో ఇంకో సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. అది నెల్సన్ సినిమానే అని అంటున్నారు. నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాని తర్వాత రజినీ, కమల్ మల్టీస్టారర్ చేయాల్సి ఉన్నప్పటికీ.. దాని కంటే ముందు సూర్య హీరోగా సితార సంస్థలో సినిమా చేస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావచ్చు.