తమ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే చెప్పుకోవడం సహజం. కానీ జస్ట్ సినిమా బావుంటుందని చెప్పుకుంటే అది జనాల దృష్టిలో పడట్లేదు. ప్రచారం రావట్లేదు. అందుకే స్టేజ్ మీద మాటలు కోటలు దాటేస్తున్నాయి. ఛాలెంజులు విసరడం.. శపథాలు చెయ్యడం.. ఇలా చాలా విపరీతాలు జరిగిపోతున్నాయి. ఐతే తీరా బొమ్మ పడ్డాక అంచనాలకు తగ్గట్లు లేకపోతే.. పాత స్టేట్మెంట్లనే పట్టుకుని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను ఇండస్ట్రీ జనాలకు ఒక హెచ్చరిక లాంటి మాట చెప్పారు. మంచి సినిమా తీశామని నమ్మకం ఉంటే గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడాలని చెప్పాలి తప్పితే.. ఈ చిత్రం ఆడకపోతే బట్టలు విప్పి తిరుగుతా.. అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వొద్దని ఆయన హితవు పలికారు.
బోయపాటి తాజాగా రైటర్ లిరిసిస్ట్ కళ్యాణ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్న నీరో సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ఈవెంటుకు వెళ్తే టీం మెంబెర్స్ ఏం మాట్లాడతారో.. ఏం స్టేట్మెంట్లు ఇస్తారో అని కింద కూర్చున్న తనలాంటి వాళ్లకు గడగడ వణుకుతున్నట్లు చెప్పారు. స్టేజ్ మీద మాట్లాడేటపుడు ఎమోషన్లోనో.. కాన్ఫిడెన్స్ తోనో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తారని.. తర్వాత సినిమాలో అంత లేకపోతే అందరికీ ఇబ్బందే అని ఆయన అన్నారు.
నీరో టీంలో కూడా ఎవరైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారేమో.. సైలెంటుగా లేచి వెళ్ళిపోదాం అనుకున్నానని.. కానీ ఎవరూ అలా చేయకపోవడంతో స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. ఇక నీరో విషయానికి వస్తే ఈ చిత్రంతో అరవింద్ అనే కొత్త కుర్రాడు హీరోగా, విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ క్రేజీగా ఉండి, యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates