పవన్ కోసం బండ్ల స్కెచ్

బండ్ల గణేష్‌ నటుడిగా చిన్న స్థాయి పాత్రలే వేశాడు కానీ.. నిర్మాతగా మాత్రం భారీ చిత్రాలే తీశాడు. చిన్న స్థాయి కామెడీ వేషాలు వేస్తూ వచ్చిన బండ్ల.. నిర్మాతగా మారడం, అంతంత భారీ చిత్రాలు తీయడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఐతే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బండ్లతో వరుసగా రెండు సినిమాలు చేయడం, అందులో ఒకటి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ కావడంతో కొన్నేళ్ల పాటు బండ్ల ఊపు మామూలుగా లేదు. కానీ అతను ఉన్నట్లుండి ఎందుకో సినిమాలు మానేశాడు. కొన్నేళ్లు ప్రొడక్షన్‌కు దూరంగా ఉండిపోయాడు. ఐతే ఈ మధ్య మళ్లీ సినిమాలు నిర్మించడం కోసం బండ్ల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తన ‘దేవుడి’గా చెప్పుకునే పవన్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు ప్రకటన అయితే చేశాడు కానీ.. వాస్తవంగా అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. మరి బండ్ల రీఎంట్రీ మూవీ హీరో ఎవరవుతారా అని అంతా ఎదురు చూస్తుండగా.. ఈ బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ పవన్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నట్లు సంకేతాలందుతున్నాయి. కొత్త సంవత్సరాది సందర్భంగా బండ్ల వెళ్లి నలుగురు మెగా హీరోలను కలిశాడు. అందులో చిరంజీవి, పవన్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వాళ్లను మర్యాదపూర్వకంగా కూడా కలవొచ్చు. కానీ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లను బండ్ల కలవడమే చర్చకు తావిచ్చింది. తేజు ఫొటో పెట్టి ‘నా హీరో’ అన్న బండ్ల.. వైష్ణవ్ ఫొటోకు ‘నా కొత్త హీరో అని క్యాప్షన్ జోడించాడు.

ఇవేమీ యథాలాపంగా చేసిన కామెంట్లు కావని.. ఆ ఇద్దరితో బండ్ల సినిమాలు చేసే అవకాశముందని.. ముందుగా వైష్ణవ్‌తో బండ్ల తర్వాతి సినిమా ఉండొచ్చని అంటున్నారు. పవన్ ఓపెన్‌గా తన ఫ్యామిలీ హీరోలను ప్రమోట్ చేయడం, వాళ్ల గురించి బాకా ఊదడటం లాంటివి చేయడు కానీ.. వారి కెరీర్లను నిలబెట్టడం కోసం తన పరిచయాలను ఉపయోగిస్తుంటాడని అంటారు. ముఖ్యంగా తేజు కెరీర్ స్లంప్‌లో ఉన్నపుడు పవన్ బాగా సపోర్ట్ చేశాడని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవ్‌కు కూడా ఆయన బ్యాకప్ అవసరముంది. అతడితో సినిమా చేయడం ద్వారా పవన్‌ను మెప్పించి.. ఆయనతో ఇంకో చిత్రానికి ఓకే చెప్పించుకుందామన్నది బండ్ల ప్లాన్‌గా భావిస్తున్నారు.