తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్ తరహా సినిమాలైతే అసలు పాటలే లేకుండా రిలీజవుతుంటాయి. సంగీత ప్రధానంగా సాగే సినిమాల్లో పది పన్నెండు పాటలు కూడా పెడుతుంటారు. ‘అన్నమయ్య’ లాంటి అరుదైన చిత్రాల్లో అంతకుమించిన సంఖ్యలో పాటలు చూశాం. ఐతే ఒక సినిమాలో 200 పాటలుండడం ఎప్పుడైనా చూశామా? ఈ అరుదైన ఘనత ‘సింగ్ గీతం’ సినిమా సాధించిందని అంటున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
ఈ సినిమాలో మాటలు కూడా పాటల్లాగే వినిపిస్తాయి. అనూహ్య పరిష్థితుల్లో ఒక గ్రామంలోని వాళ్ల మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. వాళ్లేం మాట్లాడినా పాటలాగే వినిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. దీన్నుంచి నుంచి ఊరి వాళ్లు ఎలా బయటపడ్డారన్న కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.
మాటే పాటగా మారే అరుదైన కథాంశంతో సంగీత ప్రధానంగా సాగే ఇలాంటి సినిమాకు సంగీతం అందించడం తన అదృష్టం అంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సినిమా మొత్తం మాటల కంటే పాటలే ఎక్కువగా వినిపిస్తాయని.. ఒక రకంగా ఈ సినిమాలో 200 పాటల దాకా ఉన్నట్లని అతను వ్యాఖ్యానించాడు. ఇండియన్ సినిమాలోనే కాక ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి సినిమా రాలేదని అతనన్నాడు.
రెండు దశాబ్దాల కిందటే తనకు సింగీతం ఈ కథ చెప్పినట్లు దేవిశ్రీ వెల్లడించడం విశేషం. ముందు పవన్ కళ్యాణ్ హీరోగా ఏసు క్రీస్తు మీద ఒక సినిమా చేయాలని ఆయన అనుకున్నారని.. ఆ చిత్రానికి తననే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చాక కూడా కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయిందని.. ఆ టైంలోనే తనకు ‘సింగ్ గీతం’ ఆలోచన చెప్పారని దేవి వెల్లడించాడు.
కానీ అది కూడా అప్పుడు పట్టాలెక్కలేదని.. చివరికి 2024లో తాను లండన్‌లో మ్యూజికల్ కన్సర్ట్ కోసం వెళ్లినపుడు సింగీతం తనకు ఫోన్ చేసి, గతంలో చెప్పిన కథను పట్టాలెక్కించే సమయం వచ్చిందని, ఇండియాకు వచ్చాక తనను కలవమని చెప్పారని దేవి తెలిపాడు. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో నాగ్ అశ్విన్ ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసి తానెంతో సంతోషించానని.. ఈ సినిమాకు సంగీతం అందించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని దేవి చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates