‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి  

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని మీద మాములు అంచనాలు పెట్టుకోలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, కూతురు సెంటిమెంట్, శివ నిర్వాణ దర్శకత్వం వెరసి హైప్ తెచ్చేందుకు ఇవి సరిపోయాయి. ముఖ్యంగా అయ్యప్ప మాలలో రవితేజ గెటప్, దీక్ష చుట్టూ అల్లిన కథా కథనాలు, పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు పెంచాయి. తాజాగా ట్రైలర్ లో స్టోరీ చెప్పేశారు.

ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం చిన్న ఊరిలో లగేజ్ వ్యాన్ నడుపుకునే డ్రైవర్ త్రినాధ్ (రవితేజ). అయిదో క్లాసు చదువుతున్న కూతురంటే (బేబీ నక్షత్ర) ప్రాణం. భార్యని, బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంటాడు. అయితే స్థానిక స్కూల్లో వరసగా ఆడపిల్లల చావులు జరుగుతాయి. వీటి వెనుక ఒక పెద్ద ముఠా ఉంటుంది. పిల్లల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తుప్పురేపే త్రినాధ్ అయ్యప్ప మాల వేసుకున్నాక ప్రమాదాలను ఎదురుకుంటాడు. అవేంటో తెరమీద చూడాలి.

సెన్సిబుల్ కథలను తెరకెక్కించే శివ నిర్వాణ మొదటిసారి పూర్తి కమర్షియల్ జోన్ లోకి వెళ్లిపోయారు. గతంలో టక్ జగదీశ్ లో ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఎమోషన్, యాక్షన్ బ్యాలన్స్ చేయలేక తడబడ్డారు. ఇరుముడి అలా కనిపించడం లేదు. క్రాక్ తరహాలో మంచి విలనిజంతో పాటు క్లాస్, మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు పొందుపరిచినట్టు ఉంది. నేటివిటీ గట్రా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉన్నప్పటికీ మన ఆడియన్స్ కి ఈ బ్యాక్ డ్రాప్స్ బాగా నచ్చుతున్నాయి.

గురుస్వామిగా సాయికుమార్ కీలక పాత్ర పోషించిన ఇరుముడిలో లేడీ విలన్ సెటప్ తో పాటు రౌడీ గ్యాంగ్ ని పెద్దదే పెట్టారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, ఆర్ట్ వర్క్, నటీనటులు మొత్తం నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్ తరహాలో మాస్ ని టార్గెట్ చేసుకున్న ఇరుముడికి ఆగస్ట్ 21 పెద్ద పోటీ లేదు. అయిదు రోజుల తర్వాత టాక్సిక్ ని తట్టుకుని నిలబడే కంటెంట్ ఉందని ఋజువు చేయాలంటే యునానిమస్ టాక్ రావాలి. ఆ వైబ్స్ అయితే శాంపిల్ గా కనిపిస్తున్నాయి.