భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్ రాజా రవితేజ. ఐతే ఆయనకి పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోని విషయం భీమవరంలో బుధవారం జరిగిన ఇరుముడి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడైంది. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు రఘురామ కృష్ణం రాజు.. రవితేజకు కజిన్ ఆట. ఈ విషయాన్ని ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న‌ ర‌ఘురామ‌కృష్ణంరాజు స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఇరుముడి ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయ‌న ర‌వితేజ, తాను క‌జిన్స్ అని తెలిపారు. ర‌వితేజ త‌న కంటే చాలా చిన్న‌వాడ‌ని చెబుతూ.. తామిద్ద‌రం విజ‌య‌వాడ‌లో చాలా ఏళ్లు క‌లిసి పెరిగామ‌న్నారు. ర‌వితేజ‌కు సినిమాలంటే పిచ్చి అని చెబుతూ.. డిస్కో డ్యాన్సులు కొత్త‌గా వ‌చ్చిన రోజుల్లో మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో స‌మానంగా ఆ టైపు డ్యాన్సుల్లో అద‌ర‌గొట్టేవాడ‌న్నారు. ర‌వితేజ ఎవ‌రి సాయం లేకుండా సొంతంగా క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీలో ఎదిగాడ‌ని రఘురామ కొనియాడారు.

ఇక ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడంటే కృష్ణా, గుంటూరు హీరోల ఆధిప‌త్యం ఉండేద‌ని.. ఇప్పుడంతా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌టుల‌దే హ‌వా అని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్, అల్లు అర్జున్, ర‌వితేజ లాంటి హీరోల పేర్లు చెప్పారు ర‌ఘురామ‌.

ర‌వితేజ‌, ర‌ఘురామ ఇద్ద‌రూ వారి వారి రంగాల్లో ఎంతో ఫేమ‌స్ కాగా.. ఇప్ప‌టిదాకా వీళ్లిద్ద‌రూ క‌జిన్స్ అనే విష‌యం బ‌య‌టికి రాక‌పోవ‌డం, ఇద్ద‌రూ ఎన్నడూ ఆ సంగ‌తి చెప్పుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఇరుముడి సినిమా విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ స‌ర‌స‌న ప్రియ భవానీ శంక‌ర్ న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ నెల 21న ఇరుముడి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.