పవన్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. ఎందుకంటే..

మెదడులో గడ్డతో బాధపడుతున్న ఒక మహిళకు ఆపరేషన్ థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా చూపిస్తూ డాక్టర్లు సర్జరీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పేషెంట్ కు పూర్తి స్థాయిలో మత్తు ఇవ్వకుండా మెలకువగా ఉంచే మెదడు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఇష్టమైన సినిమాను స్క్రీన్ పై ప్లే చేస్తూ వైద్యులు తమ పనిని చాలా సులువుగా పూర్తి చేశారు. వడ్లమూడి డీవీసీ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

దర్శి ప్రాంతానికి చెందిన రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు కిచిడీ సెంటర్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటేశ్వరమ్మ అకస్మాత్తుగా మూర్ఛపోయి కిందపడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు చేబ్రోలు మండలం వడ్లమూడి డీవీసీ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె మెదడులో ఒక గడ్డ ఉన్నట్లు గుర్తించి తక్షణమే దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని డిసైడ్ చేశారు.

మెదడుకు సంబంధించిన ఈ ఆపరేషన్లో పేషెంట్ స్పృహలో ఉండటం చాలా ముఖ్యం. నరాలు దెబ్బతినకుండా ఉండేందుకు పేషెంట్ మెలకువతో ఉంటూ రెస్పాండ్ అవుతూ ఉండాలి. అందుకే ఆమెకు ఎంతో ఇష్టమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను ఆపరేషన్ థియేటర్లో ప్లే చేశారు. ఒకవైపు పేషెంట్ సినిమాలో లీనమైపోగా, న్యూరో సర్జన్ అరుణ్ కుమార్, అనస్థీషియా స్పెషలిస్ట్ రాజశేఖర్ బృందం కలిసి చాలా చాకచక్యంగా ఆ గడ్డను బయటకు తీశారు.

సినిమా ధ్యాసలో ఆమెకు ఆపరేషన్ జరిగిన విషయమే పెద్దగా తెలియలేదు. ఇలాంటి క్రిటికల్ సమయాల్లో పేషెంట్ భయపడకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంచడం చాలా కష్టం. దాని కోసం డాక్టర్లు ఎంచుకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది.

అభిమాన హీరో కళ్ళ ముందు కనిపిస్తుండటంతో కోటేశ్వరమ్మ ఎలాంటి టెన్షన్ పడకుండా వైద్యులకు బాగా సహకరించారట. గతంలో కూడా సినిమాలు చూపించి ఆపరేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక రిస్క్ ఉన్న కేసును సినిమా సాయంతో ఇంత సింపుల్ గా డీల్ చేసిన డాక్టర్లను ఆసుపత్రి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ జ్యోతిర్మయి ఇతర సిబ్బంది ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.