వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన శంకరవరప్రసాద్ గారు కౌంట్ లోకి రాదు కానీ ఆయన నుంచి పన్నెండు నెలల కాలంలో సోలో హీరోగా ఒకే మూవీ రావడం పట్ల అభిమానులు కాసింత అసంతృప్తిగానే ఉన్నారు. ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో అప్డేట్స్ ఇంకా మొదలుకాలేదు. హీరోయిన్ నుంచి క్యాస్టింగ్ దాకా అన్నీ లీకులతోనే సరిపోతోంది.

అవతల అనిల్ రావిపూడి ఎప్పుడెప్పుడు వెంకటేష్ వచ్చి సెట్స్ లో అడుగు పెడతారాని ఎదురు చూస్తున్నారు. 2027 సంక్రాంతికి తన సినిమాల విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. తక్కువ సమయంలో క్వాలిటీగా తీయడం అనిల్ కి కొత్తేమి కాదు కానీ కళ్యాణ్ రామ్ తోడవ్వడంతో ఇద్దరు హీరోల మల్టీస్టారర్ కాబట్టి అటు నందమూరి అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి.

వీటి తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. విశ్వంభర దర్శకుడు వశిష్ట పట్ల నిర్మాత సురేష్ బాబు సానుకూలంగా ఉన్నారట. లైన్ నచ్చడంతో ప్రస్తుతం ఫుల్ నెరేషన్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. జానర్ బయటికి రాలేదు కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ టచ్ ఉన్న ఎంటర్ టైనర్ గా చెబుతున్నారు. ఈసారి ఫాంటసీ జోలికి పోకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. అంతా ఓకే అయ్యాక అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

ఈ లెక్కన ఆదర్శ కుటుంబం అక్టోబర్, అనిల్ – వెంకీ జనవరిలో రిలీజైతే కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఫ్యాన్స్ కి ఇచ్చిన ఘనత దక్కుతుంది. వశిష్ఠ కూడా ఓకే చేయించుకుని వేగంగా తీయగలిగితే అది కూడా దసరాకో దీపావళికో వచ్చేయొచ్చు. ఇవి కాకుండా పలువురు యంగ్ డైరెక్టర్స్ వెంకటేష్ ని కలుస్తున్నారు కానీ కథలను మెప్పించేలా చెప్పలేకపోతున్నారని వినికిడి. ఒక బ్లాక్ బస్టర్ రచయిత స్టోరీ సైతం తిరస్కారానికి గురయ్యిందట.