అంత్యక్రియల గురించి ముందే చెప్పిన గిరిబాబు

టాలీవుడ్ లెజెండరీ నటుల్లో ఒకరైన గిరిబాబు నిన్న అనాారోగ్యంతో చనిపోయారు. ఆయన వయసు 83 ఏళ్లు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా గిరిబాబు ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఏ పాత్ర చేసినా.. అతిగా నటించకుండా, చాలా సింపుల్‌గా పాత్రల్లో ఒదిగిపోవడం గిరిబాబు ప్రత్యేకత. కొన్ని నిమిషాల పాత్ర చేసినా సరే.. అందులో ఆయన ముద్ర ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో గిరిబాబు సినిమాలు బాగా తగ్గించేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దర్శకత్వంలో అతడు, అఆ లాంటి సినిమాల్లో ఆయన కోసం గుర్తుండిపోయే పాత్రలు ఇచ్చారు.

ఆ చిత్రాల్లో గిరిబాబు నటన గుర్తుండిపోతుంది. చివరగా మూడేళ్ల ముందు ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో నటించిన గిరిబాబు.. అనారోగ్యం కారణంగా తర్వాత సినిమాల్లో నటించలేదు. గత ఏడాది కాలంలో గిరిబాబు తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ విషయాన్ని నిన్న మరణానంతరం ఆయన తనయుడు రఘుబాబు వెల్లడించారు.

అల్జీమర్స్, పార్కిన్సన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్ర సమస్యలతో గిరిబాబు తీవ్రంగా ఇబ్బంది పడ్డారట. గత ఏడు నెలలుగా తన తండ్రి పూర్తిగా మంచానికే పరిమితం అయినట్లు రఘుబాబు వెల్లడించారు. కొన్ని రోజుల కిందట ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న.. మధ్యాహ్యం తనువు చాలించారు. ఈ లెజెండరీ నటుడిని నిన్న హైదరాబాద్‌లో ఎక్కువ సమయం ఉంచలేకపోయారు. సాయంత్రం ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని బయటికి తీసుకొచ్చాక సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం మూడు గంటలు మాత్రమే ఉంచారు.

అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే చేస్తారని, ఈ రోజు గిరిబాబును చూసుకుందామని అనుకున్న వారికి నిరాశ తప్పలేదు. గిరిబాబు బతికుండగానే తన అంత్యక్రియల గురించి కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పేశారట. తాను పుట్టిన ఊరు అయిన ప్రకాశం జిల్లా రవినూతలలోనే తన అంత్య క్రియలు జరపాలని చెప్పారట. ఆయన కోరిక మేరకు అక్కడే పార్థివ దేహాన్ని రావినూతలకు తీసుకెళ్లిపోతున్నట్లు చెప్పిన రఘుబాబు.. ఇక్కడ అంత్యక్రియలు చేయలేకపోతున్నందుకు క్షమించాలని అభిమానులను కోరారు. ఈ రోజు రావినూతలలోనే గిరిబాబు అంత్యక్రియలు చేస్తున్నారు.