రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోలేదు కానీ..

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ, సీనియర్ నటి రమ్యకృష్ణల వివాహ బంధం గురించి జనాలకు అనేక సందేహాలున్నాయి. వీళ్లిద్దరూ కలిసి జీవిస్తున్న సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. అలా అని ఇద్దరూ విడిపోయినట్లూ ఆధారాలేమీ లేవు. కృష్ణవంశీ ఏమో హైదరాబాద్‌లో ఉంటూ సినిమా కొత్త సినిమా ప్రయత్నాలేవో చేసుకుంటున్నారు. రమ్యకృష్ణేమో చెన్నైలో ఉంటూ బహు భాషల్లో నటిస్తోంది.

మరి వీరి వివాహ బంధం కొనసాగుతున్నట్లా.. లేక ఇద్దరూ విడిపోయినట్లా అని తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది రమ్యకృష్ణ. తామిద్దరం కలిసి లేమని.. అలా అని విడిపోయినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు. ఇద్దరం దూరంగా ఉంటూ వివాహ బంధంలో కొనసాగున్నట్లు ఆమె వెల్లడించారు. ఇలా విడిగా ఉండడానికి కారణమేంటో ఆమె వెల్లడించారు.

‘‘నేను, కృష్ణవంశీ ఇప్పటికి వివాహ బంధంలోనే ఉన్నాం. కానీ సంతోషంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. కెరీర్ కోసమే మేం అలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టినపుడు నేను సీరియల్స్‌లో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నేను చెన్నైలో ఉంటూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చేదాన్ని. నేను తనతో ఉన్నపుడు వాడు బాగుండేవాడు. నేను వెళ్లిపోయాక అనారోగ్యం పాలయ్యేవాడు. అందుకే తనను తీసుకెళ్లి చెన్నైలో స్కూల్లో చేర్పించాను. ఈ విషయం చెబితే కృష్ణవంశీ అంగీకరించాడు. కుటుంబానికి మంచిదని అలా చేశాం.

ఇక అప్పట్నుంచి నేను చెన్నైలో ఉంటున్నా. ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. దగ్గర ఉండి రోజూ గొడవపడడం కంటే ఇలా వేర్వేరుగా ఉంటూ సంతోషంగా ఉండడం మంచిది. మేం కలిసి ఉంటే మా వివాహ బంధం కొనసాగేది కాదేమో. నిజానికి పెళ్లి ఎందుకని, లివింగ్ టుగెదర్‌లో ఉందామని కృష్ణవంశీ అప్పుడే చెప్పాడు. నేను ఓకే చెప్పి ఉండాల్సింది. ఆయనకు సినిమానే ప్రపంచం. ఆయన వర్క్‌లోకి నేను వెళ్లను. నా వర్క్‌లోకి ఆయన రారు. ప్రస్తుతం మేమిద్దరం సంతోషంగా ఉన్నాం’’ అని రమ్యకృష్ణ తెలిపారు.