తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని వారాలుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద గొడవ నడుస్తన్న సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు కోసం ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా.. నిర్మాతలేమో అందుకు ససేమిరా అంటున్నారు. చివరికి ఎగ్జిబిటర్ల పంతం చూసి నిర్మాతలు త్వరలో ఆమోదయోగ్యమైన పరిష్కారం చూస్తామని అంటున్నా.. వెంటనే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాల్సిందే అని థియేటర్ల యజమానులు భీష్మించుకుని కూర్చున్నారు.
సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి నివేదిక వచ్చే వరకు ఎదురు చూడాలని నిర్మాతలు కోరినా ఎగ్జిబిటర్లు వినట్లేదు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజీ కోరుతున్నారు. ఇలాంటి పెద్ద సినిమా రిలీజైపోతే తమను పట్టించుకోరన్నది వారి వాదన. తమ గోడు వెల్లబోసుకుంటూ మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఎగ్జిబిటర్లు.. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమ వాదన వినిపించారు.
ఎగ్జిబిటర్లు అంతటితో ఆగకుండా చిరు సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి తమ బాధను చెప్పుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈలోపే.. నిర్మాతలు కొందరు ఏపీకి వెళ్లి పవన్‌ను కలవడం గమనార్హం. కొన్ని వారాల ముందు ఎగ్జిబిటర్లకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన యలమంచిలి రవిశంకర్ సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి ఈ బృందంలో ఉన్నారు.
వారంతా పవన్‌ను కలిసి థియేటర్ల సమస్య గురించి మాట్లాడారు. ఐతే ఎగ్జిబిటర్లకు చెక్ పెట్టడానికే ఈ నిర్మాతలు పవన్‌ను కలుస్తున్నారని అంతా అనుకున్నారు కానీ.. అక్కడ తమ వెర్షన్ చెప్పడంతో పాటు ఎగ్జిబిటర్ల బాధల గురించి కూడా పవన్‌కు విన్నవించినట్లు తెలుస్తోంది.
ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నిర్మాతలు కోరారట. అలాగే పర్సంటేజీ విధానం మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి కూడా విధి విధానాలు రూపొందించాలని.. ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు ఇద్దరినీ ఆదుకునేలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ఈ బృందం పవన్‌కు విన్నవించినట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates