2021కి తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల విరామం తర్వాత రాబోతున్న సినిమా ఇది. కరోనా లేకుంటే ఈ ఏడాది వేసవిలోనే సందడి చేయాల్సిన చిత్రమిది. వైరస్ తెచ్చిన విరామం వల్ల ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యమైంది.
లాక్ డౌన్ తర్వాత కొంచెం ఆలస్యంగా సెట్స్‌లోకి అడుగు పెట్టిన పవన్.. ఇటీవలే ఈ సినిమాలో తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తి చేశాడు. వేరే పాత్రధారులతో కొన్ని సన్నివేశాలు మిగిలున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే అవి కూడా పూర్తవుతాయి. ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. సంక్రాంతి సమయానికి సినిమా రెడీ చేయడం కష్టమని, అలాగే 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో సినిమాను రిలీజ్ చేస్తే నష్టమని భావించి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు.
ఫిబ్రవరి, మార్చి నెలలంటే అన్ సీజన్ కాబట్టి ‘వకీల్ సాబ్’ను అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. వేసవికి విడుదల అన్నది పక్కా. ఐతే డేట్ మాత్రమే తేలాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. వేసవిలో ఆలస్యం చేయకుండా.. ఆరంభంలోనే ‘వకీల్ సాబ్’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని ఆయన ఫిక్సయ్యాడట. ఏప్రిల్ 9కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
ఏప్రిల్ 30కి ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ విడుదల కావొచ్చని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భారీ చిత్రానికి, పవన్ సినిమాకు మూడు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుని ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ సైతం వేసవి రేసులోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మే రెండో అర్ధంలో రిలీజ్‌కు ప్లాన్ చేసే అవకాశముంది.