రజినీ ‘అసూయ’ కామెంట్… కమల్ ఏమన్నారు?

ఒకప్పుడు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దరిదాపుల్లో నిలిచే హీరో ఇంకొకరు కనిపించే వారు కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజినెస్, వసూళ్ల విషయంలో ఆయన రేంజే వేరుగా ఉండేది. కానీ విజయ్ అనే హీరో చూస్తుండగానే.. ఇంతింతై అని ఎదిగిపోయి, సూపర్ స్టార్‌ను దాటేశాడు. ఇది రజినీ అభిమానులకు రుచించలేదు.

రజినీ సైతం విజయ్ విషయంలో అసూయ చెందుతున్నాడా అన్నట్లు ఉంటోంది ఆయన వ్యవహార శైలి. ‘జైలర్’ ఆడియో వేడుకలో రజినీ స్పీచ్‌లో కౌంటర్లు విజయ్‌, ఆయన అభిమానులు ఉద్దేశించే అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
ఇక రజినీకాంత్ తన వల్ల కాదని వదిలేసిన రాజకీయాల్లోకి విజయ్ అడుగు పెట్టి అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో సూపర్ స్టార్‌లో అసూయ పతాక స్థాయికి చేరిందనే చర్చ జరిగింది.

విజయ్‌ విజయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అందులో ఆత్మీయత లేదని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఓటమి పాలైన స్టాలిన్‌ను కలవడం రజినీలో అభద్రత భావానికి, అసూయకు సంకేతాలని విజయ్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఐతే తన మీద నెలకొన్న అపోహలన్నింటికీ తెరదించుతూ విజయ్ విజయంపై రజినీ స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది. విజయ్ ఎన్నికల్లో గెలిస్తే తానెందుకు అసూయ చెందుతానని రజినీ తాజాగా విలేకరులతో వ్యాఖ్యానించారు. తన సమకాలీనుడైన కమల్ గెలిస్తే అసూయ చెందుతా కానీ, విజయ్ విషయంలో తనకు జెలసీ ఎందుకుంటుందని ఆయనన్నారు.

ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల కంటే విజయ్‌ది గొప్ప విజయమని ఆయన కొనియాడడం విశేషం. ఐతే రజినీ కామెంట్స్ విజయ్ అభిమానులను మురిపించగా.. ఆ వెంటనే లోనకాయకుడు కమల్ హాసన్ ఈ కామంట్లపై స్పందించడం విశేషం. తాను గెలిస్తే అసూయ చెందేవాడినన్న రజినీ కామెంట్లపై కమల్ రియాక్టయ్యారు.

తనకు, రజినీకి మధ్య ఎప్పడూ పోటీనే ఉందని, అసూయ ఎప్పుడూ లేదని కమల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను, రజినీ సినీ రంగంలో కాకుండా క్రికెట్ రంగంలో ఉన్నా కూడా ఇలాగే ఉండేదని కమల్ అన్నారు. ఇక విజయ్ పాలన గురించి కమల్‌ను అడిగితే రెండు రోజులకే పాలన గురించి అడిగితే ఏం చెబుతామన్న కమల్.. విజయ్‌కి ఆరు నెలల సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. విజయ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీడియా పరిశీలన జరపాలని.. కొత్తగా వచ్చిన వారిని తేలిగ్గా చూడకూడదని.. వారి నుంచి మరీ ఎక్కువ ఆశించకూడదని కమల్ అభిప్రాయపడ్డారు.