పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ కు పోటీగా ఇవాళ టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, సాహూ గారపాటి మరో సమావేశం నిర్వహించారు. ఎవరి కోణంలో వాళ్ళు రైటనిపించేలా చాలా ప్లాన్డ్ గా తమ వెర్షన్లు వినిపించారు. అంతర్గంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యని కెమెరా ముందుకు తెచ్చి ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా మాట్లాడుకునేలా చేశారు.

ఇప్పుడు అందరి చూపు జూన్ 4 వైపు వెళ్తోంది. ఒకవేళ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుండా తెలంగాణ ప్రదర్శకులు కనక మొండిపట్టు పడితే అన్ని వర్గాలు నష్టపోతాయి. ఎందుకంటే పెద్ది సింగల్ స్క్రీన్స్ లో వేయకపోతే మల్టీప్లెక్సులు కిటకిటలాడతాయి. ఇది వస్తుందనే ఉద్దేశంతో ఇతర నిర్మాతలు ఎవరూ పోటీకి రిస్క్ తీసుకోలేదు. ఆ వారమే కాదు నెక్స్ట్ వీక్ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అలాంటప్పుడు పెద్ది వేసుకోకుండా మొండిపట్టు పడితే థియేటర్లకు తాళం వేసుకోవాల్సిందే.

ఇంకోవైపు ఇది నిర్మాతలను కూడా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే కీలకమైన రెవిన్యూ ఇలాంటి సినిమాలకు సింగల్ స్క్రీన్స్ నుంచే వస్తుంది. ఫ్యాన్స్ వీటిలో రిపీట్ షోలు చూస్తారు. అల్లరి చేసి సంబరాలు తీర్చుకునేందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తారు. ఆ ఎంజాయ్ మెంట్ ఎన్ని వందలు వేలు ఇచ్చినా మల్టీప్లెక్సుల్లో దొరకదు. సో ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఎంత మాత్రం రుచించని పరిణామం. వాళ్ళు మైత్రిని లేదా దిల్ రాజు బృందం మీద నెగటివిటీ పెంచుకుంటారు.

ఎలా చూసినా పెద్దిని వదులుకోవడం ఎవరికీ క్షేమకరం కాదు. ఎందుకంటే రిలీజ్ డేట్ కేవలం ఇరవై రోజుల దూరంలో ఉంది. ఇంత తక్కువ సమయంలో ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల మధ్య సమస్య అంత ఈజీగా తీరదు. కాబట్టి కొంత టైం తీసుకోవాలి. కానీ పరస్పర వర్గాలు మేం తగ్గేది లేదు అన్న తరహాలో కనిపిస్తున్నారు. చర్యకు ప్రతి చర్య అన్న తరహాలో ఇవాళ ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో లేవనెత్తిన అంశాల గురించి రేపో ఎల్లుండో ఖచ్చితంగా రియాక్షన్లు ఉంటాయి. చూద్దాం.