రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ ఫాస్ట్ గా షూట్ చేయడంతో ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. సెప్టెంబర్ 24 విడుదల తేదీలో ఇకపై ఎలాంటి మార్పు ఉండదు. త్వరలో రాబోతున్న టీజర్ లో దాన్ని కన్ఫర్మ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసమే రెండేళ్లకు పైగా హెయిర్ స్టయిల్ మార్చకుండా మరీ కష్టపడుతున్న నాని ఒకే దెబ్బతో ప్యాన్ ఇండియా మార్కెట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ప్యారడైజ్ తర్వాత నాని చేయబోతున్న మూవీ బ్లడీ రోమియో. దర్శకుడు సుజిత్ తో ఈ కాంబోని అధికారికంగా ప్రకటించి నెలలు దాటేసింది. అయితే మధ్యలో హఠాత్తుగా ఓజి అప్డేట్స్ రావడం, పవన్ సుజిత్ చర్చలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో నాని అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. దీని వల్ల బ్లడీ రోమియో లేటవుతుందేమో అనుకున్నారు. కానీ ఆ బెంగ అక్కర్లేదు. త్వరలోనే నాని మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ముందు హైదరాబాద్ ఆ తర్వాత లండన్ షెడ్యూల్ చేస్తారు.

ఈ లెక్కన ఓజి 2కి ఇంకొంత సమయం పడుతుంది. పవన్ కళ్యాణ్ ఆసక్తిగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్లు విశ్రాంతి సూచించారు. రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కువ బ్రేక్ తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి కనీసం సినిమాల వరకైనా కాస్త గ్యాప్ ఇవ్వమని వాళ్ళు రికమండ్ చేయడంతో ఇప్పట్లో పవర్ స్టార్ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం లేనట్టే. 2027 వేసవిలోగా బ్లడీ రోమియో అయిపోయి థియేటర్లలో అడుగు పెడితే ఓజికి త్వరగా దారి దొరికినట్టు అవుతుంది.

ఓజి తరహాలోనే బ్లడీ రోమియో కూడా వయొలెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామానే. కాకపోతే సెటప్, హీరో వంట చేసే చెఫ్ నేపథ్యం చాలా కొత్తగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. నాని ఇకపై కెరీర్ పరంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుబోతున్నాడు. ఇంకోవైపు నిర్మాతగా కూడా న్యాచురల్ స్టార్ బిజీ అయిపోతున్నాడు. నితిన్ తో అలియాస్ రుక్మిణి ఇటీవలే అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగా 159 అప్డేట్స్ ప్యారడైజ్ రిలీజ్ తర్వాత వస్తాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు.