చిరు ఫ్యాన్స్‌కు కావాల్సిన అప్‌డేట్ ఇది కాదు

మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల కిందట మొదలుపెట్టిన ‘విశ్వంభర’ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. చివరగా ప్రకటించినట్లు వేసవిలో ఈ సినిమా రావట్లేదు. సోషల్ మీడియాలో గత కొంత కాలంగా ప్రచారంలో డేట్, జులై 10కి అయినా సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ టీం ఎంతకీ ఆ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. అలా అని విశ్వంభర టీం సైలెంటుగా ఉంటోందా అంటే అదీ లేదు.

ఇటీవలే త్రిష పుట్టిన రోజు నాడు సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఆ పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. ఇప్పుడేమో దర్శకుడు వశిష్ఠ.. సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘విశ్వంభర’ను కూడా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఒక వార్త ప్రచారంలోకి వస్తే.. దానిపై వ్యంగ్యంగా ‘‘అవునా.. నిజమా’’ అంటూ స్పందించాడు వశిష్ఠ. దీన్ని బట్టి ఈ సినిమా రెండు భాగాలుగా రావట్లేదని.. ఒకటే పార్ట్ అని స్పష్టమైంది.

ఐతే విశ్వంభర ఒకటిగా వస్తుందా.. రెండు భాగాలుగానా అన్నదానిపై చిరు అభిమానులకు అసలు పట్టింపే లేదు. ముందు ఈ సినిమా రిలీజ్ కానీ అంటున్నారు. ఆ డేట్ ఏదో చెప్పండి మహాప్రభో అని సోషల్ మీడియాలో అదే పనిగా మొత్తుకుంటున్నారు. మంచి ఔట్ పుట్ కోసమే టీం టైం తీసుకుంటోందని తెలిసినా, గతంలో విమర్శల పాలైన వీఎఫెక్స్ విషయంలో ఈసారి రాజీ పడకూడదని కష్టపడుతున్నా.. మరీ ఇంత టైం తీసుకోవడమేంటి అన్న ప్రశ్నలు మెగా అభిమానుల నుంచి వస్తున్నాయి.

ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడం వల్ల బజ్‌ను కోల్పోయిందని.. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు భారీ విజయాన్ని అందుకున్నాక, వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉంటుందని.. వేసవి సీజన్‌ను ఎలాగూ వదిలేశారు కాబట్టి జులైలో అయినా సినిమాను రిలీజ్ అయ్యేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. ‘పెద్ది’తో క్లాష్ ఇబ్బంది కూడా లేదు కాబట్టి జులై 10నే సినిమాను థియేటర్లకు దించేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.