చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా వెనక్కు వచ్చిన రవిబాబు కొత్త సినిమా రేజర్ వీకెండ్ ముందే చేతులు ఎత్తేసింది. విపరీతమైన వయొలెన్స్ తో, సహనానికి పరీక్ష పెట్టే కథనంతో ఆడియన్స్ ని ఏ మాత్రం మెప్పించలేక త్వరగానే ఫైనల్ రన్ కు వచ్చేసింది. మొదటి మూడు రోజుల్లోనే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయిన దాఖలాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. నెంబర్ల గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వచ్చినట్టు లేవు.
విడుదలకు ముందు రవిబాబు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఎన్నో మంచి విషయాలు పంచుకున్నారు. ఫిలిం మేకింగ్, మారిపోయిన ప్రేక్షకుల అభిరుచులు, మల్టీప్లెక్సుల దోపిడీ, టాలీవుడ్ స్టాండర్డ్స్ ఇలా ఎన్నో టాపిక్స్ టచ్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. అంతే కాదు గత అయిదేళ్లలో ఒక్క సినిమా తనను మెప్పించలేకపోయిందని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. వాటిలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్ లాంటివి కూడా వస్తాయి.
ఇంత చెప్పారు కాబట్టి రేజర్ కనీస స్థాయిలో ఉంటుందని జనం భావించడం సహజం. కాని దాన్ని అందుకోవడంలో రవిబాబు విఫలమయ్యారు. ఆయన చేసిన మరో పొరపాటు హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడం. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకే ఓపెనింగ్స్ రాని పరిస్థితుల్లో ఈ వయసులో తనను సోలో హీరోగా చూస్తారని అనుకోవడం రవిబాబు వేసిన రాంగ్ క్యాలికులేషన్. విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఓకే కానీ రెండు గంటలు కేవలం తన మీదే వన్ మ్యాన్ షో రన్ చేయడం చాలా కష్టం.
రేజర్ మీద పబ్లిక్ టాక్, రివ్యూస్ దాదాపు నెగటివ్ గా వచ్చాయి. టెక్నికల్ గా కొన్ని ఎపిసోడ్స్ లో తన పనితనం చూపించినప్పటికీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి న్యాయం చేసేలా లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ఒకవేళ ఆయన తన రెగ్యులర్ స్టైల్ లో అవును లాంటి హారర్ లేదా నచ్చావులే లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీసినా పనయ్యేదేమో కానీ ఇలా ఎలివేషన్లు నిండిపోయిన రివెంజ్ డ్రామా ఎంచుకోవడం బాగా దెబ్బ కొట్టింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పటికి వచ్చేనో.
Gulte Telugu Telugu Political and Movie News Updates